కారణాలు వెతుక్కుంటున్న టీడీపీ నేతలు
తెరపైకి కడప, కమలాపురం,ప్రొద్దుటూరు నియోజకవర్గాలు
వెన్నుపోట్లంటూ నివేదికలు సిద్ధం చేసుకున్న అభ్యర్థులు
29న చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయనున్న వైనం
మదనపల్లె, తంబళ్లపల్లె అభ్యర్థులపై కేడర్ ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. అధినేత చంద్రబాబుకు వివరించేందుకు కారణాలు వెతుక్కుంటున్నారు. వెన్నుపోటు రాజకీయాలంటూ నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇదే తరహా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. ఈనెల 29న విజయవాడలో స్వయంగా కలిసి పరిస్థితి వివరించేందుకు సిద్ధం అయ్యారు. సక్సెస్‌ఫుల్ ప్రయత్నాలు చేసినా పార్టీ నేతల వెన్నుపోటుతో దెబ్బ పడిందనే అంచనాకు వచ్చారు.
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలు వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా నిలుస్తున్నాయి. ఇదివరకు ఎన్నికలు ఏవైనా సరే ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. 2024 ఎన్నికల ఫలితాలు అదేబాటలో ఉండనున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం కళ్లముందు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమిపై సాకులు వెతుకుతున్నారు. సహచరులు ఆశించిన స్థాయిలో పనిచేయకపోగా, వెన్నుపోటు పొడిచారని నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కడప, ప్రొద్దుటూరు, కమలాపురం టీడీపీ అభ్యర్థులు.. పార్టీ నేతలు వెన్నుపోటుకు పాల్పడ్డారని ఆరోపణలకు దిగారు. ఆదే విషయాన్ని అధినేతకు వివరించేందుకు సిద్ధమయ్యారు.
అన్నమయ్య జిల్లాలో ..
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేదని, పోల్ మేనేజ్‌మెంట్ చేపట్టలేదనే అన్నమయ్య జిల్లా టీడీపీ కేడర్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తోంది. ఇప్పటికే మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్‌పై రామసముద్రం మండల మాజీ జెడ్పీటీసీ మునివెంకటప్పతోపాటు ఆ మండల కేడర్ మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. పోరాటం చేయకపోగా కేడర్‌ను అవమానాలపాలు చేశారని అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అలాగే తంబళ్లపల్లె, రాజంపేట అభ్యర్థులు జయచంద్రారెడ్డి, బాలసుబ్రమణ్యంపై కూడా కేడర్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో అభ్యర్థులు ఎఫర్ట్ పెట్టలేదని, పోల్ మేనేజ్‌మెంట్‌లో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు చేస్తున్నారు. ఇరువురు టికెట్ తెచ్చుకునే క్రమంలో పారీ్టపై చేసిన పోరాటం క్షేత్రస్థాయిలో చేయలేదనే ఆరోపణలు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. అదే విషయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.
8చంద్రబాబును కలిసేందుకు సన్నాహాలు...
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రొద్దుటూరు, కమలాపురం టీడీపీ అభ్యర్థులు నంద్యాల వరదరాజులరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి సిద్ధం అయ్యారు. ఆమేరకు బుధవారం విజయవాడలో కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రొద్దుటూరు ఇన్‌చార్జి గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రొద్దుటూరులోనూ, కమలాపురంలోనూ పారీ్టకి వ్యతిరేకంగా పనిచేశారనే ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు పెంచుకుంటున్న తరుణంలో టీడీపీ నేతలు పారీ్టకి దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమేరకు ఇరువురు ఆధారాలు సేకరించి నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రొద్దుటూరులో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో సహా ఆయన సన్నిహితులు టీడీపీకి పనిచేయలేదని వరదరాజులరెడ్డి, స్వగ్రామం కోగటంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని చైతన్యరెడ్డి కలిసికట్టుగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సైతం శల్యసారథ్యం వహించారని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచనల మేరకు పార్టీ ఫండ్ అప్పగించడంలో కూడా విఫలయయ్యారని ఆధారాలతో అందజేయనున్నట్లు సమాచారం. కాగా, కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబంపై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీ విజయం కోసం పనిచేయలేదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment