తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!? | Sakshi
Sakshi News home page

తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!?

Published Tue, Apr 23 2024 12:03 PM

Ksr Comments On Megastar Chiranjeevi's Political Decision - Sakshi

ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందులోను సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అప్రతిష్టపాలవుతారు. కానీ ఆర్దిక, రాజకీయ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు కొందరు సెలబ్రిటీలు సైతం తమ వ్యక్తిత్వాన్ని వదలుకుని దిగజారడం సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించే చెబుతున్నది. ఆయన అంటే అందరికి గౌరవమే. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తిస్తే అభిమానగణం అప్సెట్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే వ్యవహరించారు.

ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పిన చిరంజీవి సడన్గా మాట మార్చి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. పోనీ అదేదో ఏదైనా రాజకీయ పార్టీలో పోటీచేసిన సామాన్యులకు మద్దతు ఇస్తే ఆయనకు పేరే వచ్చేది. ఏ పార్టీలో ఉన్న పేదలకైనా తన అండ ఉంటుందని చెబితే ఆయనకు కీర్తి వచ్చేది. కానీ ఆయన ఒక పెద్ద పెత్తందారీకి, ఆర్దిక నేరాభియోగాలు ఉన్న వ్యక్తికి సహకారం అందిస్తున్నట్లు ప్రకటించితే జనం ఏమని అనుకుంటారు. ఆయనకు ఈపాటి ఆలోచన రాకపోయిందా! అవును! కొన్ని సబంధాల ముందు అవేవి కనపించకపోవచ్చు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు కలిసి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీకి చెందిన సీ.ఎం. రమేష్ వ్యూహాత్మకంగా బీజేపీలోకి వెళ్లి, ఇప్పుడు అనకాపల్లిలో లోక్ సభ సీటుకు కూడా పోటీచేస్తున్నారు. బహుశా చిరంజీవి, రమేష్‌లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది.

అదేదో ఢిల్లీ స్థాయిలో కనుక ఎవరి దృష్టికి రాలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో సీ.ఎం. రమేష్ కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ సంప్రదింపులు జరిపి చిరంజీవి తనకు మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. సీ.ఎం. రమేష్ పలు ఆర్ధిక నేరాభియాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఒక సినీ నటుడు వేణు ఈయనపై 450 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన రమేష్ గురించి చిరంజీవికి ఏమీ తెలియకుండా సంఘీభావం ప్రకటించి ఉంటారా? అన్న సందేహం రావచ్చు. తన సోదరుడు పవన్ కల్యాణ్‌ టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్‌ ధోరణి చూసి పలువురు జనసేన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అది వేరే కథ.

పవన్ కల్యాణ్‌ సొంతంగా పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు కోసం పనిచేసినా చిరంజీవి వారితో కలవలేదు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేకించి హిందుపూర్ లో ముస్లిం అభ్యర్ధికి కాకుండా బాలకృష్ణకు సీటు ఇవ్వడాన్ని చిరంజీవి తప్పు పట్టారు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం అయి సినిమాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. అలాగే ఉంటారులే అనుకుంటే సడన్‌గా ఇప్పుడు కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా పెత్తందారులలో భాగమేనని చిరంజీవి రుజువు చేసుకున్నారు.

ఈయన నటించిన పలు సినిమాలు చూసి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమాల వల్ల స్పూర్తిపొంది చిరంజీవి అంటే అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని భావిస్తుంటారు. ఆయన ఠాగూర్ సినిమాలో నటిస్తే, ఈయన అంత గొప్ప నిజాయితీపరుడు అని అభిమానులు అంతా సంతోషించారు. రుద్రవీణ వంటి ప్రోగ్రెసివ్ సినిమాలో హీరోగా నటించి ఆదర్శవాది అనిపించుకున్నారు. పేదల తరపున పనిచేసే నేతగా, మద్యపానాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తీరా వాస్తవ ప్రపంచంలోకి చూస్తే చిరంజీవి అందుకు భిన్నంగా కనిపించడం ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది.

సీ.ఎం.రమేష్ సారా వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, రాజకీయాలలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యారు. రమేష్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంతంగా విమానం కొని ఆయా పార్టీలవారిని అందులో తిప్పే స్థాయికి ఎదిగారు. అది చట్టబద్దంగా, న్యాయబద్దంగా చేస్తే మంచిదే. కానీ సీ.ఎం. రమేష్ నడిపిన లావాదేవీల గురించి చిరంజీవికి తెలియవని అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ ఏదో ఆతీత సంబంధం ఏర్పడి ఉండాలి. అందుకే రమేష్‌కు అనుకూలంగా చిరంజీవి ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవి తన పరువు తానే పొగొట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పలచన అయ్యారు.

చిరంజీవి ఎన్నికలలో పోటీచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్‌కు అనుకూలంగా మాట్లాడితే శభాష్ అనిపపించుకునేవారు. ఒక ఉపాధి హామీ కూలి ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఆయనకు సంఘీభావం చెప్పి ఉంటే అంతా మెచ్చుకునేవారు. కానీ ఆర్ధిక నేరారోపణలు ఉన్న బీజేపీ అభ్యర్ధులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే ఆయన మాటలకు, చేతలకు ఉన్న తేడా తెలియచేస్తుంది. అసలు చిరంజీవి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారా? ఆ పార్టీ నేతలు కొందరు ఈయన కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని చెప్పారు.. కానీ ఈయనేమో బీజేపీ కూటమి అభ్యర్ధికి భజన చేస్తున్నారు.

ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే చిరంజీవి సినిమాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాలలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఎక్కడకు వెళ్లినా వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చేవారు. దానిని చూసి ఆయన రాజకీయాలలోకి రావాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది. కానీ రాజకీయాలలోకి వచ్చేది, రానిది చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవారు.ఏదో వేరు పేరుతో సంస్థ పెట్టి కార్యకలాపాలు నిర్వహించి, తన బావమరిది అరవింద్‌ను ముందు పెట్టి కథ నడిపారు. ఆయా పార్టీలలోని నేతలు, ముఖ్యంగా తన సామాజికవర్గంవారు అంతా చిరంజీవి రాజకీయాలలోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటనలు చేసేవారు. వారంతా కోరితే వస్తున్నట్లు కనిపించాలన్నది ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చిరంజీవి గురించి, ఆయన పెట్టబోయే పక్షం గురించి వ్యతిరేక ప్రచారం చేసేశాయి. దాంతో ఆదిలోనే హంసపాదు మాదిరి ఆయన పార్టీకి విఘ్నాలు ఎదురయ్యేయి.

ఆయన ఎట్టకేలకు చిరంజీవి తిరుపతిలో ఒక భారీ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ అయితే పెట్టారు కానీ, దానికి తగ్గ వ్యూహాలు, ఎజండాను సిద్ధం చేసుకోలేకపోయారు. తొలి రోజుల్లో ఈ పార్టీ వల్ల కాంగ్రెస్‌కు దెబ్బతగులుందని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆయనకు బాగానే ప్రచారం చేశాయి. కానీ దానివల్ల తెలుగుదేశంకు నష్టం వాటిల్లుతోందని అంచనాకు వచ్చిన ఆ మీడియా వెంటనే ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని గబ్బు పట్టించేవి. ఇది కేవలం కాపుల పార్టీ అన్న ముద్రవేశారు. దానిని ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యానికి లేకుండా పోయింది. తన బావమరిది అల్లు అరవింద్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్దిక విషయాలలో కొన్ని విమర్శలు వచ్చేలా చిరంజీవి వ్యవహరించారని అంటారు. టీడీపీ అయితే చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది. టిక్కెట్లు రాని కొందరు అదే తరహా ఆరోపణలు చేసేవారు.

చంద్రబాబు నాయుడు తన కోవర్టులను కొందరిని ముందుగానే ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టి, తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి తిట్టించేవారు. ఇదే చిరంజీవికి పెద్ద సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చిరంజీవి ఆలోచన చేశారు. కానీ దానిని పడనివ్వకుండా వామపక్ష జాతీయ నేతలను చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు తదితర కారణాల వల్ల ప్రజారాజ్యం ఎన్నికలకు ముందే చతికిలపడింది. చివరికి ఉమ్మడి ఏపీలో పద్దెనిమిది సీట్లకే పరిమితం అవడం కాకుండా, చిరంజీవే రెండు చోట్ల పోటీచేసి ఒక చోట ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నడపడంలో తడబడ్డారు. ఆ దశలో జెండా పీకేద్దాం అని చిరంజీవి భావిస్తున్నారని ఈనాడు మీడియా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. అది చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు.

తదుపరి అప్పట్లో జరిగిన వివిధ పరిణామాలలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకకూలంగా మలచుకోవడంలో విఫలం అయిన ఈయన తనపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి పొంది సంతృప్తి చెందారు. కానీ 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి మళ్లీ సినిమాలపైనే దృస్టి పెడతామని అన్నారు. ఇంతలో తన సోదరుడు పవన్ కల్యాణ్‌ జనసేనను ప్రకటించినా ఈయన పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు వ్యవహరించారు. 2019లో పవన్ కల్యాణ్‌ సొంతంగా ఒక కూటమి పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు.

వైఎస్సార్‌సీపీ గెలిచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి సత్సంబంధాలు కొనసాగించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆయనకు విశేష గౌరవాన్ని ఇచ్చారు. సినిమా సమస్యలపై చర్చలు జరపడానికి ఒక బృందాన్ని తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో చిరంజీవిని అవమానించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వ్యాఖ్యానించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని చూసినవారు ఇక చిరంజీవి రాజీకీయాల జోలికి రారని అనుకుంటే పవన్ కల్యాణ్‌కు ఐదు కోట్ల చెక్ ఇచ్చి దానికి ప్రచారం కల్పించారు. బహుశా పవన్ వైపు నుంచి ఏదో ఒత్తిడి వచ్చి ఉండాలి.

ఆ తర్వాత సీ.ఎం. రమేష్ ఉదంతంతో చిరంజీవి తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఠాగూర్, రుద్రవీణ వంటి సినిమాలలో చిరంజీవి చేసింది నటనేనని, రియల్ జీవితంలో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని అభిమానులంతా అనుకునే పరిస్థితి తెచ్చారు. కాపు సామాజికవర్గం ఒకసారి చిరంజీవిని నమ్మి, తదుపరి పవన్ కల్యాణ్‌ను నమ్మి మోసపోయిందన్న అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్‌ ఇప్పటికీ వారిని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయి జనసేన ఉనికినే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్‌కు చిరంజీవి మద్దతు ఇచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేయకుండా బీజేపీకి ఎందుకు సంఘీభావం ప్రకటించారని ఆలోచిస్తే కొందరు ఇది పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినదానికి ప్రతిఫలం అని అంటున్నారు. మరి కొందరు అదే కారణం అయితే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీలో నేరుగా చేరి ఉండేవారన్నది మరికొందరి భావన. కేవలం సీ.ఎం. రమేష్‌ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కోసం వీడియో చేయడం కేవలం వ్యక్తిగత కారణాలే అయి ఉండవచ్చన్నది మరికొందరి భావన. ఏది ఏమైనా చిరంజీవి చేసింది తప్పు. అనైతికం, పరువు కోల్పోయే విషయం అని అంతా ఒప్పుకుంటున్నారు.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement