జై శ్రీరామ్‌ అనడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు | Sakshi
Sakshi News home page

జై శ్రీరామ్‌ అనడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు

Published Fri, Apr 19 2024 4:52 AM

Ktr comments over bjp - Sakshi

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శ 

ఉంటే మోదీ జేబుల్లో లేదా జైల్లో ఉండాలన్న చందంగా వ్యవహరిస్తున్నారు 

హామీలు నెరవేర్చలేక రేవంత్‌ పిచ్చి కథలు చెబుతున్నారు

వెంగళరావునగర్‌ (హైదరాబాద్‌): బీజేపీ నేతలు మాట్లాడితే జై శ్రీరామ్‌ అనడం తప్ప వారి వల్ల దేశానికి గాని, ప్రజలకు గాని ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని, ఆ పార్టీ చేసిన పనులు కూడా ఏమీ లేవని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు విమర్శించారు. శ్రీరాముడు దేవుడ ని, ఆయనను అందరూ పూజించాలని చెప్పారు. ఆ యనతో ఎవరికీ ఎలాంటి పంచాయితీ లేదన్నారు. కుల, మతాలను గౌరవించలేని పార్టీలను రానున్న ఎన్నికల్లో తొక్కేయాలని వ్యాఖ్యానించారు.

దేశంలోని నాయకులంతా ఉంటే మోదీ జేబుల్లో లేదా జైల్లో ఉండాలన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ బీజేపీని విమర్శిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ పార్టీని వెనకేసుకొస్తూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడని, ఇదెక్కడి విడ్డూరమని ప్రశ్నించారు. గురువారం రాత్రి యూసుఫ్‌గూడలోని మహమూద్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కేంద్రానికి విధేయుడిగా సీఎం రేవంత్‌ 
తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దక్కిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదని అన్నారు. ఏం చేయాలో తెలియక, హామీలను నెరవేర్చే సత్తా లేక ఫోన్‌ ట్యాపింగ్‌లంటూ ప్రజలకు పిచ్చి కథలు చెబుతున్నాడని విమర్శించారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్‌ విధేయుడిగా పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దానం నాగేందర్‌ ఎమ్మెల్యే సీటు త్వరలో ఊడుతుందని చెప్పారు. 

Advertisement
Advertisement