రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న ఎండలు
చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటేసిన గరిష్ట ఉష్ణోగ్రతలు
ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు
మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ
రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్.. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
పగటిపూట ఇంట్లోంచి బయటికి వెళ్లొద్దని సూచన
పదేళ్లలో ఇవే అత్యధికం
గత పదేళ్ల వేసవి సీజన్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడూ కూడా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటుఇటుగా నమోదయ్యేవని.. ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది.. దంచికొడుతున్న ఎండలతో కుతకుత లాడుతోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ములుగు జిల్లా మంగపేటలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, నల్లగొండ జిల్లా చండూరులో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 5 డిగ్రీ లు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నట్టు తెలిపింది.
11 జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని.. వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది.
మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీయవచ్చని హెచ్చరించింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తక్షణ సహాయక చర్యలు తీసు కునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment