103 మంది  సిట్టింగులకు... ఈసారి నో టికెట్‌ | Sakshi
Sakshi News home page

103 మంది  సిట్టింగులకు... ఈసారి నో టికెట్‌

Published Wed, Mar 27 2024 3:15 AM

Lok Sabha elections 2024: BJP focus on MP candidates Selection - Sakshi

అభ్యర్థుల ఎంపికలో బీజేపీ కఠిన నిర్ణయాలు 

మూడో వంతు ఎంపీలకు ఈసారి మొండిచేయి

ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్‌ పెట్టేందుకే

2019లోనూ 119 మంది  ఎంపీలకు టికెటివ్వని బీజేపీ

లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయంపై కన్నేసిన అధికార బీజేపీ అందుకోసం తీవ్రస్థాయి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో నిర్మొహమాటంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. గెలుపు అవకాశాలు లేవనుకుంటే ఎవరినైనా పక్కన పెట్టేస్తోంది. ఎంతటి సీనియర్లయినా, ఎంత జనాదరణ ఉన్నా పట్టించుకోవడం లేదు. ఆ క్రమంలో మొత్తం 290 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో ఇప్పటికే ఏకంగా 103 మందికి బీజేపీ టికెట్‌ నిరాకరించింది...! బీజేపీ ఇప్పటిదాకా ఆరు విడతల్లో 405 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు కూడా రాకముందే మార్చి 2న ఏకంగా 195 మందితో తొలి జాబితాను ప్రకటించడం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి పొత్తులపై, పారీ్టల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓవైపు మల్లగుల్లాలు సాగుతుండగానే భారీ జాబితా వెలువరించి దూకుడు కనబరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా తదితర కేంద్ర మంత్రులు అందులో చోటుచేసుకున్నారు. తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్‌ ఎంపీలకు బీజేపీ మొండిచేయి చూపింది. ఇక 72 మందితో ప్రకటించిన రెండో జాబితాలో ఏకంగా 30 మంది సిట్టింగులపై వేటు పడింది! మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

తర్వాత మార్చి 24న 111 మందితో ప్రకటించిన ఐదో జాబితాలోనైతే 37 మంది సిట్టింగులకు టికెట్లు గల్లంతయ్యాయి! తాజాగా మంగళవారం ప్రకటించిన మూడు స్థానాల్లోనూ సిట్టింగులను పక్కన పెట్టి ఇతరులకు టికెట్లిచ్చింది. వీరిలో కేంద్ర మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ కూడా ఉండటం విశేషం. ఈ లెక్కన ఇప్పటికే మూడో వంతుకు పైగా, అంటే 34 శాతం మంది బీజేపీ సిట్టింగులను టికెట్లు దక్కలేదు. మరో 30 నుంచి 40 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దించేలా కని్పస్తోంది. వాటిలోనూ మరింతమంది సిట్టింగులను మార్చడం ఖాయమంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 282 మంది బీజేపీ సిట్టింగుల్లో 119 మందికి టికెట్లివ్వలేదు. అంటే ఏకంగా 42 శాతం మందిని మార్చేసింది! తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను విజయవంతంగా అధిగమించగలిగామన్నది బీజేపీ అగ్ర నాయకత్వం అభిప్రాయం. అందుకే ఇప్పుడూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.  

టికెట్లు దక్కని ప్రముఖులు 
హర్షవర్ధన్, వరుణ్‌గాందీ, ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్, వీకే సింగ్, అనంత్‌కుమార్‌ హెగ్డే, రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్, అశ్వినీ చౌబే, ప్రతాప్‌ సింహ... ఇలా ఈసారి టికెట్ల దక్కని బీజేపీ సిట్టింగుల్లో పలువురు సీనియర్లు, ప్రముఖులున్నారు. వీరిలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అయితే పార్టీ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురై ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పేశారు. ఇక ప్రజ్ఞాసింగ్, రమేశ్‌ బిదురి, అనంత్‌కుమార్‌ హెడ్గే, పర్వేష్‌ సాహిబ్‌సింగ్‌ వంటి ఎంపీలపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వేటు పడింది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement