వైజాగ్‌ మాల్యా.. వంశీ! | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ మాల్యా.. వంశీ!

Published Tue, May 7 2024 8:19 AM

Notices issued to MLC Vamshi Krishna Srinivas Yadav

అప్పు ఇస్తే.. అంతే సంగతులు 

ఫైనాన్స్‌ సంస్థలకు ముప్పతిప్పలు పెట్టిన  వంశీకృష్ణ 

అప్పు తీర్చడంలేదంటూ 29 సార్లు కేసులు పెట్టిన ఆయా సంస్థలు 

మార్గదర్శి చిట్స్‌ చెల్లింపు విషయంలోనూ నోటీసులు  

ఎన్నికల్లోనూ అదే డీఫాల్టర్‌గా మిగిలిపోయిన వైనం 

ఈసారీ అదే ఫలితం పలకరిస్తుందనే ఆందోళన  

‘మీరు నిర్దేశించిన గడువులోగా తీసుకున్న అప్పు చెల్లించలేదు. కాబట్టి మీ ఆస్తుల్ని జప్తు చేస్తాం. ఇదిగో ఈ కోర్టు నోటీసులు తీసుకోండి.’ ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ తరచూ వినేమాట. 

మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశారు. కానీ.. మన వైజాగ్‌ మాల్యా వంశీకృష్ణ మాత్రం.. అప్పులు ఎగొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు. ఫైనాన్స్‌ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. వారు చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసొప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది వంశీకృష్ణకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్‌ కంపెనీల దగ్గర వంశీకృష్ణ.. ఓ డీఫాల్టర్‌ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ వంశీ ఒక డీఫాల్టర్‌ అనే చెప్పుకోవాలి.

సాక్షి, విశాఖపట్నం: వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేరు చెబితే ఫైనాన్స్‌ కంపెనీలు, బ్యాంకులు భయపడుతుంటాయి. అప్పు ఇస్తే.. తొలుత ఆయన చుట్టూ.. తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది బాబోయ్‌ అంటూ బ్యాంకర్లు తలలు పట్టుకుంటారు. షిప్పింగ్‌ కంపెనీని నడుపుతున్న వంశీ.. దాన్ని నడిపేందుకు పలు ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకునేవారు. 2011 నుంచి వంశీకి ఇదే పని. ఏ ఫైనాన్స్‌ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తప్పించుకు తిరగడమే అలవాటు మారిపోయింది.  

మార్గదర్శితో మొదలై... 
2011లో రామోజీరావుకు చెందిన మార్గదర్శిలో చిట్‌ వేశారు. మధ్యలోనే ఆ చిట్‌ని పాడేసి డబ్బులు తీసుకున్నారు. మిగిలిన నెలల చిట్‌ డబ్బుల్ని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు. నాలుగు నెలలు వరుసగా నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో మార్గదర్శి కోర్టులో పిటిషన్‌ వేసి.. ఆ డబ్బులు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంది. మరోసారి చిట్‌ వేసేందుకు మార్గదర్శి అనుమతి ఇవ్వకపోవడంతో సంక్షేమ చిట్స్‌ అనే మరో సంస్థను పట్టుకొని.. అక్కడా డబ్బులు కొల్లగొట్టి సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశారు. 

ఫైనాన్స్‌ సంస్థలకూ శఠగోపం 
చిట్‌ఫండ్‌ సంస్థలకు ఎగనామం పెట్టిన వంశీ.. 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్‌ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ఆ తరువాత ఫైనాన్స్‌ సంస్థలకు శఠగోపం పెట్టేశారు. కొన్ని సంస్థలు చివరికి కోర్టులను ఆశ్రయించి వంశీ దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి. కొంత మంది వ్యక్తుల దగ్గరా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టాలనుకున్న ఘనుడు వంశీకృష్ణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 సార్లు డీఫాల్టర్‌గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్‌ మాల్యా. 

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా... 
ఎమ్మెల్యేగా గెలిచి.. ఫైనాన్స్‌ సంస్థలను బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకోవాలనే కుయుక్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వంశీ గురించి ప్రజలకు ముందే తెలిసిపోయింది. 2009లో రాజకీయ ఆరంగ్రేటం చేసి పీఆర్‌పీ తరఫున పోటీ చేసిన వంశీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టలో చేరారు. 2014 ఎన్నికల్లో యాదవ సామాజికవర్గం నుంచి శాసనసభకు ఒకర్ని పంపించాలన్న ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు టికెట్‌ కేటాయించారు. అప్పుడూ వంశీ రుణాల గోల గురించి తెలిసిన తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ వైజాగ్‌ మాల్యాని ఇంటికే పరిమితం చేశారు. వంశీ బుద్ధి తెలుసుకున్న పార్టీ 2019లో సీటు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ఇక 2021లో 21వ వార్డులో కార్పొరేటర్‌గా అవకాశం కలి్పస్తే అతికష్టమ్మీద గట్టెక్కారు. వంశీ వక్రబుద్ధిని ప్రజలు ముందే గ్రహించి ప్రతి ఎన్నికలోనూ పాఠం నేర్పినా.. సదరు వైజాగ్‌ మాల్యా మాత్రం తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ ఫైనాన్స్‌ సంస్థలకే కన్నం వేసేందుకు యత్నించారు.

ఈ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదా?  
తూర్పు ప్రజలకు తన రుణ స్వరూపం తెలిసిపోయిందని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కన్నతల్లిలా ఆదరించిన వైఎస్సార్‌సీపీని వదిలిపెట్టి.. జనసేనలోకి చేరారు. తూర్పులో ప్రజల నుంచి పరాభవం తప్పదని దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వాస్తవానికి వంశీ యవ్వారం దక్షిణ ప్రజలకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే సదరు వంశీ షిప్పింగ్‌ సంస్థ ఎక్కువగా అక్కడే కార్యకలాపాలు నిర్వహించింది. దక్షిణలోనే విశాఖ పోర్టు కావడం.. సదరు వంశీ చేసిన అడ్డగోలు వ్యవహారాల గురించి ఆ నోటా ఈ నోటా అక్కడ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే.. వంశీ ఓట్లు అడగడానికి వస్తుంటే.. తమని కూడా అప్పులు అడగడానికి వస్తున్నాడేమోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ వంశీకి పరాభవం తప్పదని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

 

Advertisement

తప్పక చదవండి

Advertisement