చార్‌ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్‌ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్‌లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
రైల్వేశాఖ చేపట్టిన చార్‌ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.
ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్‌లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్‌లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.
హిమాలయాల్లోని చార్‌ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment