రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.
టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్‌లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.
త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్‌ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.
ఇదీ చదవండి: గూగుల్, ఓపెన్‌ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
టైటన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment