titan jewelry company
-
బడ్జెట్ ప్రకటన.. టాటా కంపెనీకి రూ.19,000 కోట్లు లాభం!
తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన టాటాకు చెందిన కంపెనీ టైటాన్‌కు ఒక్కరోజులో దాదాపు రూ.19,000 కోట్ల లాభాన్ని తెచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి పన్నును 6% తగ్గించడంతో టైటాన్ షేర్లు దాదాపు 7% పెరిగాయి. టాటా గొడుగు కింద ఉన్న జువెలరీ సంస్థ టైటాన్ బ్రాండ్ తనిష్క్ కారణంగా దాని స్టాక్ విలువలో వృద్ధిని సాధించింది.బీఎస్ఈ డేటా ప్రకారం, టైటాన్ షేరు 6.63 శాతం పెరిగి రూ.3,468.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, షేర్లు 7.30% పెరుగుదలతో ఒక రోజు గరిష్ట స్థాయి రూ.3,490కి చేరుకున్నాయి. ప్రారంభంలో టైటాన్ షేర్లు రూ.3,252 వద్ద ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ధృక్కోణంలో ఇది చాలా లాభదాయకం. ఉదాహరణకు, ఒక వ్యక్తి 10,000 టైటాన్ షేర్లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ. 215.55 పెరుగుదలతో, వారు ఆ 10,000 షేర్లపై రూ.21,55,500 లాభం పొందుతారు. గతంలో టైటాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,88,757.16 కోట్లుగా ఉండగా, మంగళవారం (జూలై 23) నాటికి రూ.3,07,897.56 కోట్లకు పెరిగింది. అంటే కంపెనీ వాల్యుయేషన్ రూ.19,140.4 కోట్లు పెరిగింది.బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్నది రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఈ నిర్ణయం తర్వాత, దేశ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు 5% పైగా తగ్గాయి. ట్రేడింగ్ సెషన్లో వెండి రూ. 5,000 పైగా క్షీణించింది. -
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్‌లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.ఇదీ చదవండి: గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీటైటన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది. -
కారట్‌లేన్‌లో టైటన్ వాటా అప్
న్యూఢిల్లీ: ఆధునిక జ్యువెలరీ బ్రాండ్ కారట్‌లేన్‌లో 27.18 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు జ్యువెలరీ దిగ్గజం టైటన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,621 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతో అనుబంధ సంస్థ కారట్‌లేన్‌లో తమ వాటా 98.28 శాతానికి జంప్‌చేయనున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ తెలియజేసింది. కారట్లేన్ వ్యవస్థాపకులు మిథున్ సాచేటి, శ్రీనివాసన్ గోపాలన్సహా వారి కుటుంబీకుల నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. 2023 అక్టోబర్‌కల్లా కొనుగోలు పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి సంస్థలో తమ వాటా ప్రస్తుత 71.09 శాతం నుంచి 98.28 శాతానికి బలపడనున్నట్లు తెలియజేసింది. కంపెనీల ఆవిర్భావమిలా.. అన్‌లిస్టెడ్ సంస్థ కారట్లేన్ ట్రేడింగ్ గతేడాది(2022–23) రూ. 2,177 కోట్ల టర్నోవర్ అందుకుంది. జ్యువెలరీ తయారీ, విక్రయాలనూ నిర్వహిస్తోంది. 2008లో పూర్తి ఆన్లైన్ బ్రాండ్‌గా ప్రారంభమైన కంపెనీలో టైటన్ తొలిసారి 2016లో ఇన్వెస్ట్ చేసింది. గత 8ఏళ్లలో తనిష్క్ బ్రాండుతో భాగస్వామ్యం ద్వారా కారట్లేన్ భారీ వృద్ధిని సాధించింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(టిడ్కో) భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైంది. 1987లో టైటన్ వాచెస్గా కార్యకలాపాలు ప్రారంభించి 1994కల్లా తన‹Ù్క బ్రాండుతో జ్యువెలరీలోకి ప్రవేశించింది. తదుపరి టైటన్ ఐప్లస్ బ్రాండుతో కళ్లజోళ్ల బిజినెస్‌నూ ప్రారంభించింది. ఈ బాటలో పరిమళాలు, దుస్తులు, మహిళల బ్యాగులు, తదితర విభిన్న అనుబంధ ఉత్పత్తుల విక్రయాలకూ తెరతీసింది. అయితే గతేడాది కంపెనీ టర్నోవర్‌లో 88 శాతం వాటాకు సమానమైన రూ. 31,897 కో ట్లను జ్యువెలరీ విభాగం నుంచే పొందడం విశేషం! -
నిమిషాల్లో రూ.500 కోట్లు: ప్రముఖ ఇన్వెస్టర్‌కి కలిసొచ్చిన అదృష్టం, కారణం!
సాక్షి,ముంబై: టైటన్ లాభాల పంటతో ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా ఝున్‌ఝన్‌వాలా సంపద భారీగా ఎగిసింది. శుక్రవారం నాటి నష్టాల మార్కెట్లోటైటన్ షేరు భారీగా లాభపడింది. టాటా గ్రూప్‌నకు చెందిన టైటన్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పబ్లిక్ షేర్‌హోల్డర్, దివంగత ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝన్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝన్‌వాలా నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 500 కోట్ల మేర అదనంగా చేరింది. టైటన్‌లో ఝున్‌ఝున్ వాలాకు 5.29 శాతం ఉంది. రాకేష్ అమితంగా ఇష్టపడే, మల్టీబ్యాగర్ టాటా గ్రూప్ స్టాక్ టైటాన్ ఈ స్టాక్ శుక్రవారం ఇంట్రాడేలో కొత్త 52 వారాల గరిష్ఠ ఈ స్టాక్ ధర రూ.105.40 మేర పెరిగింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత, జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో శుక్రవారం టైటాన్ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌లోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే 3.39 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రూ.3,211చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ హై లెవెల్ రూ. 2,85,077 కోట్లకు చేరింది. గత సెషన్లో రూ. 275,720 కోట్ల నుంచి రూ.9,357 కోట్లు పెరిగింది. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) టైటన్ షేరు ఏడాది కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పెరిగింది. జూలై 7, 2022 నాటికి బీఎస్సీలో రూ.2128 గా ఉన్న షేర్లు. శుక్రవారం కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.3211.10ని తాకింది. అంటే 2023లో టైటన్ షేర్లు 25 శాతం మేర లాభపడ్డాయన్నమాట. ఫలితంగా 5.29 శాతం వాటా ఉన్న ఝన్ ఝన్ వాలా రూ.494 కోట్ల విలువైన నోషనల్ లాభాలు ఆర్జించారు. (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?) టైటన్ కీలక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధించి క్యూ1లో ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. టైటన్ ప్రధాన ఆభరణాల వ్యాపారం సంవత్సరానికి 21 శాతం వృద్ధితో ఆకట్టుకుంది. టైటాన్ వాచీలు & వేరబుల్స్ విభాగం 13 శాతం వార్షిక వృద్ధిని, అనలాగ్ వాచీల విభాగంలో 8 శాతం వృద్ధిని, ఇతరాల్లో 84 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విస్తరణలో భాగంగా గత త్రైమాసికంలో మొత్తం 18 స్టోర్లతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 559 చేరింది. -
టైటాన్ డబుల్ ధమాకా..!
Titan Q2 Results: టైటాన్ కంపెనీ ఈ ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నికర లాభాల్లో డబుల్ ధమాకా కొట్టేసింది. క్యూ2లో 270శాతం వృద్ధితో సుమారు రూ. 641 కోట్ల ఏకీకృత నికర లాభాలను సొంతం చేసుకుంది. గత ఏడాది క్యూ2లో టైటాన్ సుమారు రూ.173 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో టైటాన్ జ్వువెలరీ కంపెనీ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో టైటాన్ జ్వువెలరీ విభాగంలో క్యూ2లో రూ. 4,127 కోట్ల నుంచి 75 శాతం పెరిగి రూ.7,243 కోట్లకు చేరుకుంది. ఆదాయం సుమారు 78 శాతం మేర పెరిగింది. టైటాన్ జ్వువెలరీ విభాగంలో గత ఏడాదిలో క్యూ2లో రూ. 3446 కోట్లను నివేదించగా, ఈ ఏడాదిగాను 77శాతం వృద్ధితో రూ. 6,106 కోట్ల ఆదాయాన్ని గడించింది. టైటాన్ గడియారాలు, వెయిరబుల్స్ మార్కెట్లో క్యూ2లో 72 శాతం వృద్ధితో 687 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు కళ్లజోడు వ్యాపారంలో కూడా భారీ గ్రోత్నే సాధించింది. ఈ ఏడాది క్యూ2లో 70 శాతం వృద్ధితో రూ. 160 కోట్లను ఆదాయాన్ని గడించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సికె వెంకటరామన్ మాట్లాడుతూ...ఈ త్రైమాసికంలో టైటాన్ బలమైన వృద్ధి నమోదుచేసింది. డిమాండ్ ఉండడటంతో అన్ని విభాగాల్లో బలంగా పుంజుకుందని పేర్కొన్నారు. చదవండి: సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..! -
10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్
ముంబై: 10 నిమిషాల్లో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే వంద, వెయ్యి, పదివేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే పది లక్షలు. కానీ, ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం ఏకంగా 850 కోట్ల రూపాయలు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్‌కు చాటారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్, నేటి(అక్టోబర్ 7) ట్రేడింగ్‌లో ధగధగా మెరిసింది. దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. కేవలం 10 నిమిషాల్లోనే మార్కెట్ క్యాపిటల్‌కు మరో రూ.17,770 కోట్లను ఈ కంపెనీ జోడించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే టైటాన్ షేర్లు 9.32% పెరిగి, రూ.2,347 రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ టాటా గ్రూపు కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు, ఆయన భార్యకు కలిపి 4.81% వాటా ఉంది. దీంతో ఇప్పుడు వారి వాటా విలువ రూ.854 కోట్ల మేర పెరిగింది. ఇంట్రాడేలో రూ.2,08,350 కోట్ల మార్కెట్ క్యాపిటల్‌కు టైటాన్ చేరుకుంటే.. ఈ సమయంలో టైటాన్ గ్రూప్ కంపెనీలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వాటా విలువ రూ.10,000 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆభరణాల తయారీదారు వ్యాపార లావాదేవీలు ప్రీ-కోవిడ్ స్థాయిలకు తిరిగి చేరుకున్నాయి. అలాగే, రాబోయే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని మదుపరుల భారీగా పెట్టుబడులు పెట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 78 శాతం వృద్ధిని టైటాన్ సాధించింది. టాటా గ్రూప్ కంపెనీ ఈ త్రైమాసికంలో కొత్తగా మరో 13 దుకాణాలను ప్రారంభించినట్లు టైటాన్ తెలిపింది.(చదవండి: టార్గెట్ మిత్రా.. ప్లేస్ కొట్టుడు పక్కా) -
ఒక్క నెలలో రూ.900 కోట్లు సంపాదించిన బిగ్ బుల్!
ది ఇండియన్ వారెన్ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టె విషయం అందరికీ తెలిసిందే. అయితే, స్టాక్ మార్కెట్ అందరికీ కనక వర్షం కురిపించదు. స్టాక్ మార్కెట్‌పై పట్టు ఉన్న వారిని మాత్రమే లక్ష్మీ దేవి కరుణిస్తుంది. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పిలిచే "బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా" కొనుగోలు చేసిన టాటా మోటార్స్ షేరు ధర సుమారు 13 శాతం పెరగగా, టైటాన్ కంపెనీ షేర్లు 11.40 శాతం పెరిగాయి. ఈ రెండు కంపెనీల షేరు భారీగా పెరగడంతో రాకేష్ జున్‌జున్‌వాలా నికర విలువ ఒక నెలలోనే ₹893 కోట్లు పెరిగింది.(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు బజాజ్ షాక్!) టాటా మోటార్స్ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం బిగ్ బుల్ 3,77,50,000 షేర్లను కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ షేర్ ధర ఎన్ఎస్ఈలో ప్రతి ఈక్విటీ షేర్ల ధర ₹287.30 నుంచి ₹331కు పెరిగింది. ప్రతి షేరు విలువ ₹43.70 పెరిగింది. దీంతో, రాకేష్ జున్‌జున్‌వాలా సెప్టెంబర్ 2021లో టాటా మోటార్స్ వాటా హోల్డింగ్ నుంచి ₹164.9675 కోట్లు సంపాదించారు. అలాగే, టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. 'బిగ్ బుల్' 3,30,10,395 షేర్లను కలిగి ఉండగా, రేఖా జున్‌జున్‌వాలా(రాకేష్ జున్‌జున్‌వాలా భార్య) 96,40,575 వాటాలను కలిగి ఉన్నారు. కాబట్టి, ఇద్దరి పేరు మీద కలిసి టైటాన్ లో 4,26,50,970 షేర్లు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ నెలలో టైటాన్ షేర్లు ₹1921.60 నుంచి ₹2092.50కు పెరిగింది. ఈ కాలంలో టైటాన్ కంపెనీ షేరు విలువ ₹170.90కి పెరిగింది. ఈ కంపెనీ షేర్ల విలువ ప్రకారం.. రాకేష్ జున్‌జున్‌వాలా ₹728.90 కోట్లు సంపాదించారు. కాబట్టి, ఈ రెండు టాటా గ్రూప్ స్టాక్స్ లో బిగ్ బుల్ నికర విలువ సెప్టెంబర్ 2021లో 893.87 కోట్లు పెరిగింది. జున్‌జున్‌వాలా తన స్వంత పేరు, అతని భార్య రేఖా పేరుతో రెండింటిలోనూ భారీగా పెట్టుబడి పెట్టారు.(చదవండి: బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా?) -
పసిడి ఎఫెక్ట్ : 1500 కోట్ల ఆదాయం
సాక్షి, ముంబై: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి తన మార్కెట్ మంత్రాను చాటుకున్నారు. టైటన్ షేర్లలో పెట్టుబడులు ఆయనకు బంగారంలా కలిసి వచ్చాయి. కరోనా సంక్షోభంతో బంగారం ధరలు నింగికెగిసాయి. దీంతో రాకేశ్ కేవలం గత మార్చి నుంచి 1500 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించారు. బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగడంతో ఆయన ఫావరెట్ టైటన్ షేర్లుసోమవారం 4.4 శాతం పెరిగి 1,089.10 రూపాయలకు చేరుకుంది. మార్చి 24, 2020న 720 రూపాయల కనిష్టం నుండి 50 శాతానికి పైగా పెరిగింది. 2020లో టైటన్ ఇప్పటివరకు 9 శాతం క్షీణించగా గత నెలలో 8 శాతం ఎగియడం విశేషం. దీనికితోడు ఒక్కో షేరుకు 4 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. జూన్ త్రైమాసికం నాటికి రాకేశ్, అతని భార్య రేఖా 4.90 కోట్ల షేర్లు లేదా 5.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. టైటన్ షేర్లు మార్చి కనిష్ట స్థాయికి పడిపోయినపుడు, పెట్టుబడుల విలువ 3,528 కోట్ల రూపాయలుగా ఉంది. శుక్రవారం నాటికి 5,112 కోట్లకు పెరిగింది. అంటే మార్చి నుండి 1,584 కోట్ల వృద్ధిని సాధించింది. ఆభరణాల విభాగంలో రికవరీ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందని జూన్ క్వార్టర్ అప్డేట్లో టైటన్ తెలిపింది. మహమ్మారి వ్యాప్తి తరువాత, బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగిందని టైటన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీకే వెంకటరమణ తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షలతో వివాహ ఖర్చు తగ్గడం, అంతర్జాతీయ ప్రయాణాలు లేకపోవడంతో ఆభరణాల కొనుగోళ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతారని, దీంతో రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
బిగ్‌బుల్‌ను కాపాడని టైటాన్ షేరు!
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు కొన్ని నెలలుగా బేర్ కౌగిట్లో చిక్కుకున్నాయి. దీంతో బడా బుల్ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలు కూడా నష్టాల్లో నడుస్తున్నాయి. చివరకు ప్రతి బేర్ దశలో కూడా నష్టాలనుంచి తప్పించుకునే బిగ్బుల్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియో సైతం ఈ సారి నష్టాలపాలైంది. సహజంగా ప్రతిసారి షేర్లు పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరగడం, దీంతో బంగారం ధర ఆధారిత టైటాన్ షేరు దూసుకుపోవడంతో రాకేశ్ పోర్టుఫోలియోకు రక్షణ లభించడం జరిగేది. కానీ ఈ సారి ఈ సీన్ రివర్సయింది. ఈ సారి ఎప్పటిలాగే మార్కెట్ పతనం సందర్భంగా పసిడి ధర దూసుకుపోవడం జరిగింది. డిసెంబర్లో పదిగ్రాముల బంగారం ధర రూ. 37000 ఉండగా, ప్రస్తుతం ఈ ధర దాదాపు 47-48వేల రూపాయలకు చేరింది. కానీ ఎప్పటిలాగా ఈ పెరుగుదల టైటాన్ షేర్లలో జోష్ ఇవ్వలేదు. ఈ షేర్లు తాజా పతనంలో దాదాపు 30 శాతం పడిపోయాయి. దీంతో పలు బ్రోకరేజ్‌లు షేరుపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. ఇలా బంగారం ధర పెరిగితే టైటాన్ షేరు ధర రివర్సులో పడిపోవడం 15 ఏళ్ల తర్వాత జరిగింది. రాకేశ్ పోర్టుఫోలియోలో టైటాన్ వాటా పెద్దది. దీని ధర పెరగకపోవడం అంతిమంగా ఆయన పోర్టుఫోలియోను కుంగదీసింది. బంగారం ధర పెరిగినా టైటాన్ ధర పెరగకపోవడానికి కారణం ప్రధానంగా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు నిలిచిపోవడమేనని ప్రభుదాస్ లీలాధర్ సంస్థ అంచనా వేసింది. దీనికితోడు అధికమాసాలు రావడం, శ్రాద్ధమాసాలు పెరగడం, బయట మార్కెట్లో ఇన్వెస్టర్లు ఆభరణాలకు బదులు కాయిన్స్, బార్లు కొని దాచుకోవడం.. తదితరాలు టైటాన్‌ను దెబ్బతీశాయని ఫిలిప్ క్యాపిటల్ విశ్లేషించింది. పైగా కంపెనీకి చెందిన ఎక్కువ స్టోర్లు మాల్స్‌లో ఉండడం, ఇవన్నీ లాక్డౌన్లో మూతపడడం కూడా ప్రభావం చూపింది. ఇక పండుగలు పబ్బాలు స్తబ్దుగా గడిచిపోవడం, పెళ్లిళ్ల వాయిదా, ఫంక్షన్లు జరగకపోవడం వంటివన్నీ ఆభరణాల అమ్మకాలపై నెగిటివ్ ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ కలిసి రాకేశ్ పోర్టుఫోలియోను దెబ్బతీశాయి. -
పాత బంగారాన్ని కొంటాం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు స్థిరంగా ఉన్నా అమ్మకాలు పెరగలేదని, ఎన్నికల తర్వాత బంగారంపై సుంకాలు తగ్గే అవకాశం ముందని ప్రముఖ జ్యూవెలరీ సంస్థ టైటాన్ (తనిష్క్) అంచనా వేస్తోంది. ఆభరణాల తయారీకి దిగుమతులపై కాకుండా స్థానికంగా ఉండే బంగారాన్ని సేకరించడానికి త్వరలోనే గోల్డ్ బై బ్యాక్ స్కీంను ప్రారంభిస్తామంటున్న టైటాన్ సీఈవో (జ్యూవెలరీ) సి.కె.వెంకటరామన్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై ఆంక్షలు విధిస్తుండటంతో పరిశ్రమ ఏమైనా బంగారం కొరతను ఎదుర్కొంటోందా? ప్రభుత్వ ఆంక్షలకు తోడు డిమాండ్ తగ్గడంతో దిగుమతులు క్షీణిస్తున్న అంశాన్ని చూస్తూనే ఉన్నాం. అమ్మకాలు బాగా తగ్గడంతో ప్రస్తుతం పరిశ్రమ బంగారం కొరతను ఎదుర్కొనడం లేదు. కరెంట్ ఖాతా లోటు అదుపులోకి రావడంతో వచ్చే ఎన్నికల తర్వాత బంగారంపై విధించిన సుంకాలు దిగొస్తాయని అనుకుంటున్నాం. దిగుమతుల కంటే రీ-సైకిల్డ్ గోల్డ్‌పై ప్రధానంగా దృష్టిసారించమని ఆర్బీఐ సూచిస్తోంది? ఈ దిశగా టైటాన్ ఏమైనా ఆలోచిస్తోందా? ప్రస్తుతం భారతీయుల దగ్గర 30,000 టన్నులకు పైగా బంగారం ఉంది. దీన్ని తిరిగి కొనుగోలు చేయడం ద్వారా అవసరాలను తీర్చుకోమని ఆర్బీఐ కోరింది. కాని దీనికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు లేవు. మా తనిష్క్ షోరూంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా ఈ ఏడాదిలోగా గోల్డ్ బైబ్యాక్ స్కీంను ప్రవేశపెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాం. సెంటిమెంట్ పరంగా చూస్తే భారతీయులు బంగారాన్ని విక్రయించడానికి అంతగా ఇష్టపడరు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్కీం జయవంతం అవుతుందని అనుకుంటున్నారా? బంగారం సెంటిమెంట్ విషయంలో ఉత్తరాది వారికంటే దక్షిణాది వారికి సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. వీరు ఆభరణాలు అమ్మడానికి ఇష్టపడరు కాని కాయిన్స్ విక్రయించడానికి వెనుకాడరు. భారతీయులు కలిగిన 30 వేల టన్నుల బంగారంలో సుమారు 15 నుంచి 20 శాతం కాయిన్స్ ఉన్నట్లు అంచనా. అంటే 4,500 నుంచి 6,000 టన్నుల బంగారం కాయిన్స్ రూపంలో అందుబాటులో ఉంది. ఈ మొత్తాన్ని ఒకటి రెండు సంవత్సరాలు కొనుగోలు చేయడం ద్వారా దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. గత కొంతకాలంగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు తగ్గి స్థిరంగా ఉండటంతో అమ్మకాలు ఏమైనా పెరిగాయా? రెండు సంవత్సరాల క్రితం నుంచి బంగారు ఆభరణాల పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంకా కోలుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. అమ్మకాలు తగ్గడంతో వ్యాపార విస్తరణను ఏమైనా తగ్గించారా? రాష్ట్ర విస్తరణ కార్యక్రమాల గురించి వివరిస్తారా? ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా కొత్తగా మరో 30 షోరూంలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర విభజన సమస్య అమ్మకాలపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా బంద్‌లు, సమ్మెల వల్ల వ్యాపారం బాగా పడిపోయింది. దీంతో రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించాం. ప్రస్తుతం బంగారు ఆభరణాల తయారీలో యాంత్రీకరణ ఏ స్థాయిలో ఉంది? ఇతర రంగాలతో పోలిస్తే బంగారు ఆభరణాల తయారీకి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. ఈ రంగంలో ఇప్పుడిప్పుడే యాంత్రీకరణ జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం 30 శాతం ఆభరణాలు యంత్రాల ద్వారా తయారవుతుంటే, మిగిలినవి చేతి ద్వారానే తయారవుతున్నాయి. యంత్రాల ద్వారా తయారవుతున్న వాటిలో అత్యధికంగా చైన్లు, గాజులు ఉన్నాయి. ఆభరణాల తయారీ పరిశ్రమ నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీని పరిష్కారం కోసం మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఈ రంగంలోకి కొత్త వారసులు రాకపోవడంతో నిపుణులు కొరత ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దీనికి ప్రధాన కారణం సరైన ఆదాయం లభించకపోవడమే. అందుకే దీన్ని పరిష్కరించడానికి కారిగర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశాం. అన్ని సౌకర్యాలు ఒకేచోట అందిస్తుండటంతో స్వర్ణకారుల ఆదాయం రెట్టింపు అవుతోంది. సాధారణంగా ఒక స్వర్ణకారుడు నెలకు 600 గ్రాముల ఆభరణాలు తయారు చేస్తుంటే, ఈ కేంద్రాల్లో 1,500 గ్రాముల వరకు తయారు చేస్తున్నారు. రానున్న కాలంలో యాంత్రీకరణ పెంచడం ద్వారా ఈ సామర్థ్యాన్ని మూడు కేజీలకు పెంచాలన్నది మా ఆలోచన. అలాగే ఒక ఆభరణం తయారు కావడానికి సగటున 21 రోజులు పడితే ఈ కేంద్రాల్లో మూడు రోజుల్లోనే తయారవుతోంది. దేశం నుంచి బంగారు ఆభరణాల ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి? వీటిల్లో టైటాన్ వాటా ఎంత? బంగారం వినియోగంలో మనం ముందున్నా.. ఆభరణాల ఎగుమతులు అసలు లేవనే చెప్పాలి. దీనికి కారణం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మన ఆభరణాల తయారీ లేకపోవడమే. ఈ కారిగర్ కేంద్రాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభరణాలను తయారు చేసి ఎగుమతులు పెంచాలన్నది మా దీర్ఘకాలిక లక్ష్యం.