
సాక్షి, ముంబై: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి తన మార్కెట్ మంత్రాను చాటుకున్నారు. టైటన్ షేర్లలో పెట్టుబడులు ఆయనకు బంగారంలా కలిసి వచ్చాయి. కరోనా సంక్షోభంతో బంగారం ధరలు నింగికెగిసాయి. దీంతో రాకేశ్ కేవలం గత మార్చి నుంచి 1500 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించారు.
బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగడంతో ఆయన ఫావరెట్ టైటన్ షేర్లుసోమవారం 4.4 శాతం పెరిగి 1,089.10 రూపాయలకు చేరుకుంది. మార్చి 24, 2020న 720 రూపాయల కనిష్టం నుండి 50 శాతానికి పైగా పెరిగింది. 2020లో టైటన్ ఇప్పటివరకు 9 శాతం క్షీణించగా గత నెలలో 8 శాతం ఎగియడం విశేషం. దీనికితోడు ఒక్కో షేరుకు 4 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. జూన్ త్రైమాసికం నాటికి రాకేశ్, అతని భార్య రేఖా 4.90 కోట్ల షేర్లు లేదా 5.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. టైటన్ షేర్లు మార్చి కనిష్ట స్థాయికి పడిపోయినపుడు, పెట్టుబడుల విలువ 3,528 కోట్ల రూపాయలుగా ఉంది. శుక్రవారం నాటికి 5,112 కోట్లకు పెరిగింది. అంటే మార్చి నుండి 1,584 కోట్ల వృద్ధిని సాధించింది.
ఆభరణాల విభాగంలో రికవరీ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందని జూన్ క్వార్టర్ అప్‌డేట్‌లో టైటన్ తెలిపింది. మహమ్మారి వ్యాప్తి తరువాత, బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగిందని టైటన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీకే వెంకటరమణ తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షలతో వివాహ ఖర్చు తగ్గడం, అంతర్జాతీయ ప్రయాణాలు లేకపోవడంతో ఆభరణాల కొనుగోళ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతారని, దీంతో రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment