తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన టాటాకు చెందిన కంపెనీ టైటాన్‌కు ఒక్కరోజులో దాదాపు రూ.19,000 కోట్ల లాభాన్ని తెచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి పన్నును 6% తగ్గించడంతో టైటాన్ షేర్లు దాదాపు 7% పెరిగాయి. టాటా గొడుగు కింద ఉన్న జువెలరీ సంస్థ టైటాన్ బ్రాండ్ తనిష్క్ కారణంగా దాని స్టాక్ విలువలో వృద్ధిని సాధించింది.
బీఎస్‌ఈ డేటా ప్రకారం, టైటాన్ షేరు 6.63 శాతం పెరిగి రూ.3,468.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో, షేర్లు 7.30% పెరుగుదలతో ఒక రోజు గరిష్ట స్థాయి రూ.3,490కి చేరుకున్నాయి. ప్రారంభంలో టైటాన్ షేర్లు రూ.3,252 వద్ద ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
పెట్టుబడిదారుల ధృక్కోణంలో ఇది చాలా లాభదాయకం. ఉదాహరణకు, ఒక వ్యక్తి 10,000 టైటాన్ షేర్‌లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ. 215.55 పెరుగుదలతో, వారు ఆ 10,000 షేర్లపై రూ.21,55,500 లాభం పొందుతారు.
గతంలో టైటాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,88,757.16 కోట్లుగా ఉండగా, మంగళవారం (జూలై 23) నాటికి రూ.3,07,897.56 కోట్లకు పెరిగింది. అంటే కంపెనీ వాల్యుయేషన్ రూ.19,140.4 కోట్లు పెరిగింది.
బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించాలని తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్నది రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఈ నిర్ణయం తర్వాత, దేశ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 5% పైగా తగ్గాయి. ట్రేడింగ్ సెషన్‌లో వెండి రూ. 5,000 పైగా క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment