తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు.
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ Starliner వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్-V రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.
Today's #Starliner launch is scrubbed as teams evaluate an oxygen relief valve on the Centaur Stage on the Atlas V. Our astronauts have exited Starliner and will return to crew quarters. For updates, watch our live coverage: https://t.co/plfuHQtv4l
— NASA (@NASA) May 7, 2024
అయితే 90 నిమిషాల ముందర రాకెట్‌లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సునీత.. మిషన్ పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్‌మోర్ కూడా వెళ్లాల్సి ఉంది.
మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.
అందుకే ఒకింత ఆత్రుత.: సునీత
తాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐఎస్‌ఎస్‌కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉంది. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు.
రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు.
సునీత ఒక మారథాన్ రన్నర్. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment