భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(59) అరుదైన ఘనతను సాధించారు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్) చేరుకున్నారామె. ఆ సమయంలో సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన 26 గంటల తర్వాత వారు బోయింగ్ అంతరిక్ష నౌకను ISSలో విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఐఎస్‌ఎస్‌లో వీళ్లిద్దరికీ ఘన స్వాగతం లభించింది. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను సునీత, బుచ్ విల్మోర్‌లు ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది.
That feeling when you're back on the station! 🕺
@NASA_Astronauts Butch Wilmore and Suni Williams are greeted by the @Space_Station crew after @BoeingSpace #Starliner's first crewed journey from Earth. pic.twitter.com/fewKjIi8u0— NASA (@NASA) June 6, 2024
ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఈ విధంగా డ్యాన్స్ చేసి వేడుక చేసుకున్నానని తెలిపారామె. కాగా, బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. స్టార్‌లైనర్‌లో ప్రయాణించిన మొదటి సిబ్బంది విలియమ్స్, విల్మోర్. వీళ్లిద్దరూ అక్కడ వారం గడుపుతారు.
ఈ యాత్ర ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇవాళ ఉదయం కూడా హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ.. ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్‌ఎస్‌కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్‌మోర్‌లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment