వయనాడ్‌, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? | Sakshi
Sakshi News home page

వయనాడ్‌, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?

Published Tue, May 7 2024 10:22 AM

Strategy of Rahul and Priyanka

ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు  యూపీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ మరో సస్పెన్స్‌కు తెరలేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్‌ అటు కేరళలోని వయనాడ్‌, ఇటు యూపీలోని రాయ్‌బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.

గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్‌, రాయ్‌బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.

తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్‌బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.

ఇక వయనాడ్‌ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్‌బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.

అయితే ఈసారి వయనాడ్‌లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్  ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్‌కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్‌ అటు వయనాడ్‌, ఇటు రాయ్‌బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్‌బరేలీని వదులుకుని, వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్‌ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్‌బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్‌ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. 

Advertisement
 
Advertisement