కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్‌బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.
గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్‌బరేలీ ఎంపీగా రాహుల్‌గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.
రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ 54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ రాయ్‌బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment