2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక నేత రెండు స్థానాలలో ఎంపీగా ఉండకూడదు. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదులుకుంటారా లేక రాయ్ బరేలీ సీటును వదులుకుంటారా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన వయనాడ్ సీటును వదిలి, రాయ్ బరేలీకి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది.
రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదిలిపెట్టడానికి కారణం సోనియా గాంధీ అని చెబుతున్నారు. ఎందుకంటే రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు సాంప్రదాయక స్థానం. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ మాజీ పార్లమెంటు స్థానం కూడా ఇదే. గతంలో సోనియా గాంధీ రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు.
తన జీవితమంతా రాయ్‌బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నడిచిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్‌ను మీవాడిగా చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ తాను రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాలను గెలుచుకున్నానని, ఈ రెండు లోక్‌సభ స్థానాల ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఈ రెండు స్థానాలకు ఎంపీని కావాలనుకుంటున్నానని, అయితే ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలని, దీనిపై చర్చించి ఏ సీటును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకుంటానని రాహుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment