ధైర్యం ఉంటే నన్ను విమర్శించు పవన్‌ | Sakshi
Sakshi News home page

ధైర్యం ఉంటే నన్ను విమర్శించు పవన్‌

Published Thu, Apr 11 2024 5:35 AM

Mudragada Padmanabham comments on Pawan Kalyan - Sakshi

చిన్న సినిమా ఆర్టిస్టులతో  తిట్టించడం దేనికి?

ఘోరాతిఘోరంగా హైదరాబాద్‌లో పవన్‌కు అవమానం జరిగింది

అలాంటి వ్యక్తి ఇంటికి టిఫిన్‌ చేయడానికి వెళ్లాడు

ఈ కోపం, పౌరుషం, ఆవేశం అప్పుడేమయ్యాయి?

వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం ధ్వజం

కిర్లంపూడి: గతంలో పవన్‌ కళ్యాణ్‌కు ఎవరికీ జరగని రీతిలో హైదరాబాద్‌లో ఘోరాతిఘోరంగా అవమానం జరిగిందని వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్లి పవన్‌ టిఫిన్‌ చేసి వచ్చాడన్నారు. సీఎంను తిట్టడానికి బహిరంగ సభల్లో ఊగిపోతున్న ఆయనకు ఈ కోపం, పౌరుషం, పట్టుదల, ఆవేశం అప్పుడు ఎక్కడికి పోయాయన్నారు. పవన్‌కు జరి­గిన అవమానం సామాన్యుడికి జరిగినా వారు నిలదీస్తారని.. కానీ ఈ పెద్దమనిషి ఒక్క మాటకూడా అనలేదని గుర్తు చేశారు.

చిన్న సినిమా ఆర్టిస్టులతో తనను పవన్‌ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ధైర్యం ఉంటే నేరుగా తనను విమర్శించాలని సవాల్‌ విసిరారు. మీడియా ముందుకొచ్చి తనను కొన్ని ప్రశ్నలు అడిగితే తాను కూడా పవన్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అగ్నికుల క్షత్రియులు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలివచ్చి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆయ న మాట్లా­డుతూ పవన్‌ సిని­మాలు తీసుకోవడానికి పిఠాపురంలో ఎమ్మెల్యే పదవి కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌ తనతోపాటు నారా లోకేశ్‌ను, నందమూరి బాలకృష్ణను కూడా తీసుకొచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయి­ంచగలరా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తామని, వైఎస్సార్‌సీపీ ఓటరుకి లక్ష రూపాయలు ఇస్తుందని మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని ముద్రగడ మండిపడ్డారు. 

అప్పుడప్పుడూ రాజకీయాలు చేసేవారిని పక్కనపెట్టాలి
అప్పుడప్పుడూ వచ్చి రాజకీయాలు చేసే నాయకులను పక్కన పెట్టి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం అభ్యర్థి వంగా గీతను గెలిపించి జగన్‌ను మరోసారి సీఎం చేయాలని ముద్రగడ అభ్యర్థించారు.  

మరో 30 ఏళ్లు వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉంటారు.. 
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి త్వరలో పిఠాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతున్న వైఎస్‌ జగన్‌ మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ముద్రగడ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం చూడలేక, అధికారం దక్కదనే ఉక్రోశంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం సభ్యత అనిపించుకోదన్నారు. జగన్‌ను తిట్టడం, అధికార దాహంతో నోటికొచ్చిన అబద్ధాలు ఆడడం చంద్రబాబు స్థాయికి తగదన్నారు. 

Advertisement
Advertisement