ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్‌.. కారణమిదే? | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్‌.. కారణమిదే?

Published Sat, Apr 20 2024 7:02 AM

No Voting in Six Districts of Nagaland - Sakshi

నాగాలాండ్‌లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్‌ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్‌ఎన్‌టీ) బంద్‌ పిలుపుతో ఈ ప్రాంతంలోని  నాలుగు లక్షల మంది ఓటర్లలో ఎవరూ  ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. 

తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ)ఎఫ్‌ఎన్‌టీ డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో ​​ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు.  కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది  ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ లోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

నాగాలాండ్‌లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఎఫ్‌ఎన్‌టీకి సంబంధించిన ‘డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్’ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్లు చెప్పారు. 

గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్‌పీవో ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈఎన్‌పీవో గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్‌ను  ప్రకటించింది. 

Advertisement
Advertisement