సీసీఎస్‌లో కాంగ్రెస్ సోషల్‌మీడియా సభ్యులు
అమిత్ షా ప్రసంగం డీప్ ఫేక్ కేసులో తొలుత అదుపులోకి..
సాయంత్రానికి అరెస్టు చూపిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
ఢిల్లీలో నమోదైన కేసులో నిందితుల అరెస్టు కోసం వచ్చిన అక్కడి పోలీసులు
అప్పటికే ఐదుగురిని సీసీఎస్ అదుపులోకి తీసుకోవడంతో స్టేషన్ వద్దే నిరీక్షణ
తాము అరెస్టు చేయకుండా చూసేందుకే వారిని ముందే
అదుపులోకి తీసుకున్నారని అనుమానం
ఎట్టకేలకు అరెస్టు చూపడంతో తిరుగుముఖం.. పీటీ వారెంట్‌పై తరలించే చాన్స్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగం వీడియో డీప్ ఫేక్ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం ఉదయమే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం ఇన్‌చార్జి సతీశ్‌తోపాటు యాక్టివిస్ట్‌లు నవీన్, తస్లిమా, గీత, వంశీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో ఉన్న సైబర్ క్రైమ్ ఠాణాకు తరలించారు. సాయంత్రానికి వారి అరెస్టును ప్రకటించారు. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రావడంతో రోజంతా కాస్త హైడ్రామా నడిచింది.
రోజంతా హైడ్రామా.. ఢిల్లీ పోలీసుల నిరీక్షణ..
అమిత్ షా ప్రసంగం వీడియో డీప్ ఫేక్ కేసులో ఇవే ఆరోపణలకు సంబంధించి ఢిల్లీలో మరో కేసు నమోదు కావడంతో రాష్ట్రానికి చెందిన ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు గురువారం హైదరాబాద్ వచ్చారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఢిల్లీ పోలీసులు సైబర్ క్రైం ఠాణా వద్దకు చేరుకున్నారు. కానీ ఠాణా లోపలకు మీడియా సహా ఎవరినీ సైబర్ క్రైం పోలీసులు అనుమతించలేదు.
దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంను తాము అరెస్టు చేయకుండా అడ్డుకోవడానికే సైబర్ క్రైం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని స్పెషల్ సెల్ అధికారులు భావించారు. నిందితులను ప్రశ్నించాక నోటీసులు ఇచ్చి పంపిస్తారనే ఉద్దేశంతో సాయంత్రం వరకు బషీర్‌బాగ్ ప్రాంతంలోనే కాపు కాశారు. అయితే సీసీఎస్ పోలీసులు ఐదుగురి అరెస్టును సాయంత్రం ప్రకటించడంతో స్పెషల్ సెల్ పోలీసులు ఆ ప్రాంతం విడిచి వెళ్లారు. నిందితులకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై ఢిల్లీ తరలించాలని స్పెషల్ సెల్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇదీ కేసు..
గత నెల 25న సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తానని మాట్లాడినట్లు ఓ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు అన్ని హ్యాండిల్స్ దీన్ని పోస్టు చేయడమో లేదా షేర్ చేయడమో చేశాయి. ఈ వీడియోపై బీజేపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ జి.ప్రేమేందర్‌రెడ్డి గత నెల 27న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా అధికారులు ఐపీసీతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో టీపీసీసీ ‘ఎక్స్’ ఖాతాను నిందితుల జాబితాలో చూపారు. మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా ఈ అంశంపై గత నెల 28న కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తులో భాగంగా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి సహా పలువురి కి నోటీసులు జారీ చేశారు. ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో కొందరు కాంగ్రెస్ నేతల వ్యక్తిగత సహాయకులు, సోషల్ మీడియా టీం సభ్యులను అరెస్టు చేశారు. ఇందులో భాగంగా టీకాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులను అరెస్టు చేసేందుకు ఓ ప్రత్యేక బృందం గురువారం హైదరాబాద్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment