సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్‌లో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బయటకు వచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో కూడా ప్రణీత్ రావు అండ్ కో టీమ్ కీలకంగా వ్యవహరించినట్టు వెల్లడయింది.
వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎపిసోడ్‌కు కర్త, కర్మ, క్రియగా ఇద్దరు పోలీసు అధికారులు వ్యవహరించినట్టు తాజా విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను అనధికారికంగా ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
ఎమ్మెల్యేల సంభాషణలను రికార్డు చేసిన ప్రణీత్‌రావు.. వాటిని ప్రభుత్వం అందజేయగా.. అలర్ట్ అయినట్లు విచారణలో తేలిసింది. ఈ ఆపరేషన్‌ను పకడ్బందీగా చేపట్టే బాధ్యతను రాధాకిషన్ అండ్ కోకు అప్పగించినట్టు సమాచారం. దీంతో రాధాకిషన్ తన బృందంతో ఒక రోజు ముందు వెళ్లి సీసీ కెమెరాలను పక్కాగా అమర్చినట్టు వెల్లడైంది. గెస్ట్ హౌజ్‌లో ఏ రకమైన వ్యవహారమైనా పక్కాగా రికార్డు అయ్యేలా సీసీ కెమెరాలను, మైక్‌లను అమర్చినట్టు తాజా విచారణలో బయటపడింది.
ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ తరపున వచ్చిన బీఎల్ సంతోష్‌లను పక్కాగా ట్రాప్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఈ టీమ్‌లో ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. త్వరలోనే మరికొందరిని కూడా పోలీసులు విచారించనున్నట్టు తెలిసింది.
నోటీసులిచ్చేందుకు ప్రత్యేక విమానామా?
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో స్పెషల్ విమానంలో ఆనాటి సిట్ బృందం తిరిగినట్లు విచారణలో తేలింది. అయితే, కేసు విచారణ సందర్భంగా అధికారులు విమానాల్లో ప్రయాణించడం సాధారణమే అయినా కేవలం నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ వినియోగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ప్రత్యేక విమానం బీఆర్ఎస్‌కు సంబంధించిన ఓ కీలక నేతకు చెందినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీ, కేరళకు వెళ్లారు. బీఎల్ సంతోష్, తుషార్‌కు నోటీసులు ఇవ్వడానికి పోలీసు అధికారులు ఈ స్పెషల్ ఫ్లైట్ ను వినియోగించారు. ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ ఎవరి ఆదేశాల మేరకు వినియోగించారు అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment