సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని కేంద్రమంద్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని అన్నారు. రిటైర్డ్ అధికారుల నేతృత్వంలో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని దుయ్యబట్టారు.
రాజకీయపరమైన కక్ష సాధింపు చర్య
రాజకీయపరమైన లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు కిషన్‌రెడ్డి. వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం, నియమాల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యహరించిందన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అక్రమంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రతిపక్షాల ఫోన్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా ట్యాప్ చేశారన్నారు. ఉప ఎన్నిక సమయంలో తమ అభ్యర్థులు, నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల, సమాజంలో పెద్దల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిదిందన్నారు.
పార్టీ ఫిరాయింపులపై కిషన్ రెడ్డి రియాక్షన్
పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ఒక ఎజెండాగా పెట్టుకుందన్నారు కిషన్ రెడ్డి. కుక్కలు, నక్కలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ అంటున్నారని.. కుక్కలు, నక్కలను పార్టీలో ఎందుకు పెట్టుకున్నారో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయాన్ని కాలరాసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని ప్రశ్నించారు. . దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి పార్టీ మారాలని అన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదని పేర్కొన్నారు.
‘ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రూ. కోట్లు దోపిడికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగింది. ఫోన్ ట్యాపింగ్ వెనక కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉందని విచారణలో బయటపడింది. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలి. కేంద్రహోంశాఖ అనుమతి తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు. కేటీఆర్ మొన్న అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఫోన్లు ట్యాపింగ్ చేయవచ్చు అన్నారు... నిన్న నాకేం సంబధం అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో షాడో ముఖ్యమంత్రిలాగా కేటీఆర్ వ్యవహరించలేదా? ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి బీఆర్‌ఎస్ గుర్తుపై పునరాలోచన చేయాలి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment