Telangana: వలస ఓటర్ల వేట | Sakshi
Sakshi News home page

Telangana: వలస ఓటర్ల వేట

Published Sun, Nov 12 2023 3:26 AM

A special teams to bring voters on polling day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌  :  బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ఓటర్లే ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని మారుస్తారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. వారి ప్రసన్నం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వలస వెళ్లిన ఓటర్లు పదివేల మందికిపైనే ఉంటారు. వీరి ఓటింగ్‌ అభ్యర్థి గెలుపోటములను ప్రభా వితం చేసే వీలుంది. దీంతో పోటాపోటీ ఎన్నికలు జరిగే స్థానాల్లో ఏ ఒక్క ఓటును తేలికగా విడిచిపెట్టకూడదని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు.

ఈక్రమంలో దూర ప్రాంతాల నుంచి వారిని రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ పది మందికి ఓ సమన్వయకర్తను నియమిస్తున్నారు. సంబంధిత గ్రామాల్లో కార్యకర్తలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు.  

ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువంటే.. 
♦ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, భువ నగిరి, ఆలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లోనే  2 లక్షల మంది ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 40 వేలమందికి పైగా వలస ఓటర్లున్నట్టు లెక్కగట్టారు. వీళ్లంతా హైదరాబాద్, భీవండి, ముంబై, సూరత్, షోలాపూర్‌ ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటున్నారు.  

♦ దేవరకొండ నియోజకవర్గంలో 25 వేల మంది వరకూ వలస ఓటర్లున్నట్టు తెలుసుకున్నారు. వీళ్లు హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తది­త­ర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లారు. భువనగిరి, ఆలేరుల్లో దాదాపు  20 వేల మంది, తుంగతుర్తి, సాగర్, సూర్యాపేటల్లో పదివేలకు తక్కువ కాకుండా వలస ఓటర్లు ఉంటా­రని ప్రధాన పార్టీలు లెక్కలేశాయి. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే ఓ నియోజకవర్గంలో 18 వేల వలస ఓటర్లు ఉంటాయని ఓ ప్రధాన పార్టీ లెక్కలేసింది. ముంబై, సోలాపూర్, పుణేలో వివిధ పనులు చేసు కు­నే వీళ్ల కోసం ఆయా సామాజిక వర్గం నుంచే కొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి, పోలింగ్‌కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 6 వేలమంది వలస ఓటర్లున్నారు. అక్కడ ఈ ఓట్లే కీలకంగా భావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వారిని రప్పించేందు­కు రేషన్‌ డీలర్ల సాయం కూడా తీసుకుంటున్నారు.  

నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లో వలస ఓటర్లు 15 వేలకు పైగానే ఉంటారు. మహబూబ్‌ నగర్, దేవరకద్ర, మక్తల్, అచ్చంపేట, నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గాల్లోనూ 10 వేల ఓట్లరు ఉంటారని అంచనా. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, ధన్వాడ, కోయిల కొండ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్‌పేట మండలాల ప్రజలు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండీడ్, మహ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలకు చెందిన వలస కార్మికులు భారీగా ఉన్నారు. వీరిని రప్పించేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

రంగంలోకి ప్రత్యేక బృందాలు 
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో హైదరాబాద్‌ వచ్చిన వాళ్ళున్నారు. వీళ్ళకు ఇప్పటికీ ఓట్లు, రేషన్‌ కార్డులు వారి సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వలస ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి చిరునామా, ఫోన్‌ నంబరుతో ఓ డేటాబేస్‌ రూపొందించడానికి సాంకేతిక నిపుణులూ ఇందులో ఉంటున్నారు.

వివిధ పార్టీల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ప్రతీ రెండు గ్రామాలకు ఒక్కో బృందం పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటున్నారు. నియోజకవర్గం వారీగా వలస ఓటర్ల వివరాలను కంప్యూటరీకరణ చేసేందుకు మరో పది మంది డేటా ఆపరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరితో మాట్లాడటం, వారికి ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా డబ్బులు పంపే యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఉంటోంది.

ఓటరు కచ్చితంగా ఏ పార్టీకి ఓటు వేస్తాడనే అంచనాలను ఆయా ప్రాంతాల్లోని నాయకుల ద్వారా సేకరిస్తున్నారు. ఇక పూణే, షోలాపూర్, సూరత్‌ వంటి ప్రాంతాలకు అభ్యర్థుల ప్రతినిధులు స్వయంగా వెళ్ళి వలస ఓటర్లను కలుస్తున్నారు. ఎన్నికలకు కనీసం రెండు రోజుల ముందే గ్రామాలకు రప్పించాలని నేతలు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement