నరేంద్రమోదీ.. రాహుల్‌గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలివి
బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి,కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
కరీంనగర్ టౌన్: ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలారా.. నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధం. మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి’అంటూ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండి సమక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నరేంద్రమోదీ, రాహుల్‌గాం దీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. పదేళ్ల ఎన్డీఏ పాలన, అంతకుముందు పదేళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామాఆర్టిస్ట్, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు.
తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్.. సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, మోదీ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారని విమర్శించారు. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, 2జీ, బొగ్గు, విమానాలు, కామన్‌వెల్త్ గేమ్, ఆదర్శ స్కాంలు.. ఐపీఎల్, గడ్డి కుంభకోణం, సహారా, ఈఎస్‌ఐ, హవాలా చివరకు చెప్పుల స్కాం (ఫేక్ లెదర్ సొసైటీ ఏర్పాటు)లో వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యాపారులను సంకలో వేసుకొని తిరిగిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు.
కానీ మోదీ మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని వివరించారు. అందుకే 140 కోట్ల మందికి గ్యారంటీ మోదీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు మోదీ వేములవాడ రాజన్నను దర్శించుకుంటారని, తర్వాత 9 గంటలకు వేములవాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారని, సభను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment