ఏపీలో బీజేపీకీ బాబే లీడర్‌ | Sakshi
Sakshi News home page

ఏపీలో బీజేపీకీ బాబే లీడర్‌

Published Thu, Apr 25 2024 4:23 PM

TDP Chandrababu Politics In BJP Andhra Pradesh - Sakshi

దేశమంతా మోదీ కా పరివారే.. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురందేశ్వరి

సొంత పార్టీ నేతలను కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు 

కూటమి కట్టినా బీజేపీ సీట్లూ టీడీపీ నేతలకే

బద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితి

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులా అంటున్న కమలం నాయకులు

సాక్షి, అమరావతి  
ఓ పారిశ్రామికవేత్త: టీడీపీ అభ్యర్థి టీడీపీ ఆశీస్సులతో బీజేపీలో చేరి టికెట్‌ పొందారు
చంద్రబాబు అభిమాని: మేమంతా ఒకే ఫ్యామిలీ అండి. ఎన్‌డీఏ ఫ్యామిలీ
పారిశ్రామికవేత్త: అంటే ‘మోదీ కా పరివార్‌’ అంటారు
చంద్రబాబు అభిమాని: బాబు గారి కుటుంబం అండి. కుటుంబ పెద్ద ఎలా చెబితే అలా..
మరో చంద్రబాబు అభిమాని: అంతే మేడమ్‌.. ‘బాబు కా పరివార్‌’ మేడమ్‌.. నాట్‌  
‘బురిడీ కా పరివార్‌’.
..అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా నిన్నటివరకు టీడీపీలో ఉన్న 
నల్ల­మిల్లి రామకృష్ణారెడ్డిని పురందేశ్వరి ప్రకటించడంపై ఓ పారిశ్రామిక వేత్త, టీడీపీ ట్విట్టర్‌ విభాగంలో పనిచేసే ఇద్దరు ఆ పార్టీ అభిమానుల మధ్య సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో జరిగిన చిన్న చర్చ ఇది.

టీడీపీ నాయకులకే బీజేపీ ముసుగు..
దేశంలోని బీజేపీ నాయకులంతా ‘మోదీ కా పరివార్‌’గా ప్రచారం చేసుకుంటుంటే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ‘చంద్రబాబు పరివారం’ అంటూ రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరినీ టీడీపీ  అధినేత చంద్రబాబు గుప్పిట్లో పెట్టేశారు. గత ఏడాది జులైలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల చేపట్టిన నాటి నుంచే ఆమె కమలం పువ్వుకు పసుపు రంగులు అద్దడం మొదలు పెట్టారని ఆ పార్టీ నేతలే అంటున్నారు.

రెండు నెలల కిత్రం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన నాయకుడినే నామినేషన్ల ముగింపునకు రెండు రోజుల ముందు బీజేపీలో చేర్చుకొని, అదే స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా భీ ఫారం ఇచ్చారంటే.. ఇవి పొత్తులు కావని, లాలూచీలు అంటేనే బాగుంటుంది కదా అంటూ కమలం నేతలే ఎత్తిపొడుస్తున్నారు. రాష్ట్రంలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ, రెండు మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే నమ్ముకున్న బీజేపీ నాయకులకు ఒకరిద్దరికి మించి టిక్కెట్లే దక్కలేదు. మిగతా వారంతా టీడీపీ నాయకులే బీజేపీ టిక్కెట్ల పొందారు. ఈ పొత్తులు, అభ్యర్థుల ఎంపిక మొత్తం ఒక పథకం ప్రకారం నడిపించారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బద్వేలు నుంచి ఈరోజు బి ఫారం ఇచ్చిన అనపర్తి వరకు ఇదే తంతు అని మండిపడుతున్నారు.

► రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను పరిశీలిస్తే.. బద్వేలు అభ్యర్ధి రోశన్న అభ్యర్ధుల ఎంపికకు ఒక్క రోజు ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పటివరకు ఆయన టీడీపీ నియోజకవర్గ ప్రధాన నాయకుడు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నాయకుడు పనతల సురేష్‌కు టిక్కెట్‌ ఇవ్వడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మనసు రాలేదు.

► అనపర్తి నియోజకవర్గ పరిస్థితి మరీ ఘోరం. బీజేపీతో పొత్తుకు ముందు చంద్రబాబు తొలి జాబితాలోనే ఫిబ్రవరి 24న ఈ నియోజకవర్గం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. ఆ తర్వాత ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడంతో నల్లమిల్లి సీటు కోల్పోయారు. పురందేశ్వరి ఆయన్నే మంగళవారం బీజేపీలో చేర్చుకొని, అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ జాతీయ నాయతక్వం అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణంరాజును గత నెల 27నే ప్రకటించింది. అయితే, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన్ని అడ్డుకొంది. స్థానిక టీడీపీ నాయకులు కూడా ఆయన ప్రచారం కూడ మొదలుపెట్టకుండా అడ్డుకున్నారు. చివరకు ఇక్కడ చంద్రబాబు చెప్పినట్లుగా టీడీపీ నేతకే బీజేపీ టిక్కెట్‌ దక్కింది.

► 2019 ఎన్నికలు వరకు టీడీపీలో ఉండి, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే తాత్కాలిక పునరావాసం కోసం బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, ఎన్‌. ఈశ్వర్‌ రావు వంటి నాయకులకు ఇప్పుడు బీజేపీలో సీట్లు దక్కాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం రమేష్‌కు ఉత్తరాంధ్రలో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఆదినారాయణరెడ్డి జమ్ములమడుగు అసెంబ్లీ సీట్లను, ఎన్‌. ఈశ్వర్‌ రావుకు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వీరంతా చంద్రబాబు బలమైన కోటరీ అన్న విషయం అందరికీ తెలిసిందే. 

► బీజేపీకి కేటాయించిన కైకలూరు అసెంబ్లీ అభ్యర్ధిగా ప్రకటించిన కామినేని శ్రీనివాస్‌ (పార్టీకన్నా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరు) సైతం 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తు ఖాయమని తెలిశాక కమలం పార్టీలో చేరిపోయి, ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించారు. 2019లో రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోవడంతో ఆయన తిరిగి బీజేపీ తరుపున పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేసిన వ్యక్తి. పొత్తులు లేనప్పుడు పోటీకి దూరంగా ఉండి,  ఇప్పుడు మళ్లీ పొత్తు కుదరడంతో బరిలోకి దిగారు. ప్రత్యేకంగా ఈయన కోసమే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కైకలూరు అసెంబ్లీ స్థానం కోరి మరీ తీసుకుంది. 

► ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరిన దగ్గుబాటి పురందశ్వరి.. ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని రాజమండ్రి లోక్‌సభ  స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

► అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు వరకు పార్టీ సభ్యత్వం కూడా లేని వరప్రసాద్‌ తిరుపతి లోక్‌సభ స్థానంలో బీజేపీ టిక్కెట్‌ కొట్టేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అయిన ఆయనకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కకపోవడంతో కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ చుట్టూ తిరిగారు. చివరకు తిరుపతి బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో చంద్రబాబు సూచన మేరకు ఆ పార్టీలోకి జంప్‌ అయ్యారు. ఆయనకే చంద్రబాబు బీజేపీ టిక్కెట్‌ ఇప్పించారు.

► ఏడాది క్రితం కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట లోక్‌సభ టిక్కెట్‌ దక్కింది. 2011-14 మధ్య ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వాన్ని కాపాడారని రాజకీయ నిఫుణులు అంటుంటారు.  

Advertisement
Advertisement