తుప్పు పట్టిన సైకిల్‌లో మిగిలింది బెల్‌ మాత్రమే: సీఎం జగన్‌ | AP Elections 2024: CM YS Jagan Speech At Korukonda Junction | Sakshi
Sakshi News home page

తుప్పు పట్టిన సైకిల్‌లో మిగిలింది బెల్‌ మాత్రమే: సీఎం జగన్‌

Published Tue, May 7 2024 12:37 PM | Last Updated on Tue, May 7 2024 1:46 PM

AP Elections 2024: CM YS Jagan Speech At Korukonda Junction

తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం.  చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది.  చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.

మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?.  గతంలో ఎప్పుడూ చూడని విధంగా..  రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.

మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.

నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్‌ బడులు.  పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌,  బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?..  

నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?

నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?

పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.

గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.

ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్‌లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. 

సైకిల్‌ డ్యామేజ్‌ ఎంతలా అంటే..  
ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్‌ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్‌ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్‌ రిపేర్‌ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి..  తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు సీటు లేదు. చక్రాల్లేవ్‌. సైకిల్‌కు పెడెల్‌ లేదు. ట్యూబ్‌లు ల్లేవ్‌‌. మధ్యలో ఫ్రేమ్‌ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్‌ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్‌ పేరే అబద్ధాల మేనిఫెస్టో.

ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్‌ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు.  నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా?  

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా  ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. 

ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?

ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్‌ సిక్స్‌ అంట నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.

ఢిల్లీతో కుట్రలు పన్ని..
ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్‌ ఏదైనా బటన్‌లు నొక్కాడో.. ఆ బటన్‌లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా  ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్‌లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్‌ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్‌ 4వ తేదీ తర్వాత..  ఒక వారంలోనే ఆ బటన్‌లు అన్నీ క్లియర్‌ చేస్తాడు.  

👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే  జగన్‌లాగా బాబు బటన్‌లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్‌లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.

👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.

👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు.  అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.

రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్‌ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement