నన్ను చూడొద్దు..ఎన్‌డీఏను చూడండి | Sakshi
Sakshi News home page

నన్ను చూడొద్దు..ఎన్‌డీఏను చూడండి

Published Fri, Apr 19 2024 1:35 AM

TDP president Chandrababu pleads in Prajagalam meetings - Sakshi

ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వేడుకోలు

తద్వారా తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదని ఒప్పుకోలు 

ఇచ్చిన 650 హామీల్లో 10% కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన బాబు 

చేసిన మంచేమీ లేక ప్రజలను ఓటు వేయాలని అడిగే నైతికత కోల్పోయిన వైనం 

సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను పట్టించుకోని జనం 

అందుకే తన పాలనను చూసి కాకుండా.. ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని పిలుపు 

ఎన్‌డీఏలో భాగస్వామికాని వైఎస్సార్‌సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వొద్దని ప్రచారం 

కమీషన్ల కక్కుర్తితో పోలవరం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది ఈయనే 

ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే అధిక ప్రయోజనమంటూ అప్పట్లో సమర్ధన 

విషయం లేకే బాబు ఎన్‌డీఏ పేరుతో విన్యాసాలు చేస్తున్నారంటోన్న రాజకీయ విశ్లేషకులు  

58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరిస్తున్న సీఎం జగన్‌ 

2014లో అధికారంలోకి వచ్చాక బాబు చేసిన మోసాన్ని ఎండగడుతున్న ముఖ్యమంత్రి  

‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌   
  
‘నన్ను కాదు.. ఎన్‌డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్‌సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  

మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? 
మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్‌ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్‌కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.     

సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్‌డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది.

ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్‌ 8న కొలువుదీరిన సర్కార్‌ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది.

చంద్రబాబు, మోదీ, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్‌ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు.

బీసీ సబ్‌ ప్లాన్‌ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్‌ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు.

పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్‌ సిక్స్‌ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్‌డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. 
 
విషయం లేకే బాబు విన్యాసాలు  

బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్‌ కళ్యాణ్‌ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్‌డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్‌సీపీని రెండోసారి గెలిపించి చాన్స్‌ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులు ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు.

Advertisement
Advertisement