వీళ్లా.. అభ్యర్థులు! | Sakshi
Sakshi News home page

వీళ్లా.. అభ్యర్థులు!

Published Sat, Apr 6 2024 5:11 AM

Telugu Desam Party is getting weaker day by day - Sakshi

రోజురోజుకు బలహీన పడుతున్న తెలుగుదేశం పార్టీ 

మరోపక్క సీఎం జగన్‌ బస్సు యాత్రతో మరింత కుదేలు 

ఎంత హంగామా చేసినా పార్టీ గ్రాఫ్‌ పెరగడంలేదని టీడీపీలో ఆందోళన 

పొత్తు ఖరారయ్యాక మరింత బలహీనపడ్డామంటున్న ఆ పార్టీ నేతలు

10 శాతం అభ్యర్థులనైనా మారుద్దామని నిర్ణయం 

20 మందికిపైగా తెలుగుదేశం అభ్యర్థుల మార్పుపై కసరత్తు 

బీజేపీ, జనసేనకిచ్చిన కొన్ని సీట్లలోనూ మార్పులకు అవకాశం 

సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్నకోద్దీ తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనపడిపోతోంది. 2019లో ప్రజలు కొట్టిన దెబ్బకు పార్టీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే దొరకలేదు. డబ్బున్నదనో, ఇతర కారణాలతోనే మొత్తంమీద అభ్యర్థులనైతే ఎంపిక చేశారు. వీరిలో అధిక శాతం పోటీకైతే సిద్ధమయ్యారు కానీ, క్షేత్రస్థాయిలో కనీస ప్రభావం చూపించలేకపోతు­న్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు.

కొందరిని అయినా మార్చి ఇంకా ధన బలం ఉన్న వారిని పోటీకి పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. మరోపక్క సీఎం జగన్‌ చేపట్టిన సిద్ధం సభలు, బస్సు యాత్రతో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కనీస పోటీ ఇచ్చేందుకైనా మరింత బలమైన అభ్యర్థులను నిలపాలని బాబు భావిస్తున్నారు. 

పనిచేయని పొత్తులు 
2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో ఈ ఎన్నికల్లో ఇతర పారీ్టలతో పొత్తులు ఉంటే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు జనసేన, బీజేపీతో కలిశారు. అయినా పార్టీ బలం పెరగకపోగా మరింతగా క్షీణించడంతో సహనం కోల్పోయి ఎన్నికల ప్రచా­ర సభల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు.

మరోవైపు చంద్రబాబు సభలు, రోడ్‌షోలకు జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీలో ఆందోళన పెరిగిపోతోంది. ఒకవైపు వైఎస్‌ జగన్‌ రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తుతుంటే తమ సభలకు జనం రాకపోవడంతో టీడీపీ నాయకులకు కళ్లెదుటే ఓటమి కనిపిస్తోంది. చంద్రబాబు నాలుగు నెలల క్రితమే ప్రకటించిన మేనిఫెస్టో, ఇప్పుడు తాజాగా ఇస్తున్న ఎన్నికల హామీలు ప్రజలను ఏమాత్రం నమ్మించలేకపోతున్నాయి.  

సత్యవేడు అభ్యర్థి మార్పు! 
చిత్తూరు జిల్లా సత్యవేడులో ఫిరాయింపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని మార్చడం దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలానికి ప్రజల్లో ఆదరణ లేదని గ్రహించిన వైఎస్సార్‌సీపీ సీటు నిరాకరించింది. ఆయన్ని టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు అదే సీటు కేటాయించారు. ఇప్పుడు తత్వం బోధపడటంతో ఆదిమూలాన్ని తప్పించి మరో వ్యక్తికి సీటు ఇవ్వాలని చూస్తున్నారు. అడ్డగోలు వాదనలు చేయడం ద్వారా ఎల్లో మీడియాలో గుర్తింపు పొందిన కొలికపూడి శ్రీనివాస్‌ని గొప్ప వ్యక్తిగా భావించి తిరువూరు సీటు ఇచ్చేశారు.

కానీ అక్కడ ఆయన్ని తట్టుకోలేక సొంత పార్టీ నేతలే లబోదిబోమంటున్నారు. దీంతో శ్రీనివాస్‌ని వదిలించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడిలో స్థానిక నేతలను కాదని ఎన్‌ఆర్‌ఐ సొంగా రోషన్‌ను ఎంపిక చేశారు. ఆయన కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని తెలియడంతో మరొక డబ్బున్న నేత కోసం కసరత్తు చేస్తున్నారు. గజపతినగరం, శ్రీకాకుళం, పాతపట్నం, మడకశిర స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

తప్పుడు ప్రచారమూ పని చేయలేదు.. 
క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మొన్నటివరకు తప్పుడు ప్రచారం ద్వారా హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా, మౌత్‌ క్యాంపెయినర్ల ద్వారా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేయించి ప్రజలను తికమక పెట్టాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అయినా వాపు­నే బలుపు అనుకుని టీడీపీ గ్రాఫ్‌ పెరిగిపోయిందని చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరో­జులుగా గాల్లో తేలిపోయారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చాక వైఎస్సార్‌సీపీ నిర్వహించిన నాలుగు ‘సిద్ధం’ సభలు టీడీపీ అబద్ధపు ప్రచారాన్ని పటాపంచలు చేశాయి.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేపడుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఉన్న ఆదరణను తేటతెల్లం చేస్తోంది. దీంతో టీడీపీ అంతర్మథనంలో మునిగిపోయింది. పొత్తులు కూడా వికటించినట్లు తేలడంతో ఇప్పుడు 10 శాతం అభ్యర్థులనైనా మార్చి ఉన్నంతలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే దిశగా చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. 

ఉండి, అనపర్తి సీట్లపై అనిశ్చితి
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపైనా అనిశ్చితి నెలకొంది. ఉండి సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించినప్పటికీ, చంద్రబాబు ఒత్తిడితో వివాదాస్పద నేత రఘురామకృష్ణరాజును అక్కడ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. రఘురామరాజుకు బీజేపీ నర్సాపురం ఎంపీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేస్తారని చెబు­తున్నారు.

రఘురామరాజు  నర్సాపురం ఎంపీ సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా­రు. అది సాధ్యం కాకపోతే ఉండి సీటు కేటాయించక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని మాడుగల అ­భ్యర్థిని మార్చాలని అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ ఒత్తిడి తెస్తుండడంతో ఆ దిశగానూ కసరత్తు నడుస్తోంది. కడప ఎంపీ, జమ్మలమడు­గు ఎమ్మెల్యే స్థానాల మార్పుపైనా చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు.

అనపర్తి సీటు మళ్లీ తిరిగి టీడీపీకి కేటాయించే దిశగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేన­కు కేటాయించిన నర్సాపురం స్థానాన్ని టీడీపీ తీసుకుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. మొ­త్తంగా 20కిపైగా ఎమ్మెల్యే, ఒకట్రెండు ఎంపీ స్థా­నా­ల్లో అభ్యర్థులను మార్చడం ద్వారా బలమైన వైఎస్సార్‌సీపీకి కనీస పోటే ఇచ్చేలా వాతావరణాన్ని మార్చాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.  

Advertisement
Advertisement