టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు | TMC Has A New Role For MP Mahua Moitra, She Thanked TMC Party And Its President Mamata Banerjee - Sakshi
Sakshi News home page

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు

Published Mon, Nov 13 2023 5:19 PM

TMC has a new role for MP Mahua Moitra she reacts - Sakshi

ముడుపులు  తీసుకొని  లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ.  కృష్ణానగర్ (నాడియా నార్త్) పార్టీ జిల్లా అధ్యక్షురాలి నియమించింది. ఈరోజు బెంగాల్‌లో అధికార పార్టీ ప్రకటించిన 15 మంది కొత్త జిల్లాల చీఫ్‌లలో మోయిత్రా కూడా  ఒకరు. లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ  సిఫార్సు  చేసిన తరువాత   జరిగిన ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

దీనిపై  టీఎంసీ ఎంపీ  మొయిత్రా ఎక్స్‌(ట్విటర్‌)లో  స్పందించారు. తన నియామకంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,  టీఎంసీ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణానగర్ ప్రజల కోసం తాను ఎప్పుడూ పార్టీతో కలిసి పనిచేస్తానంటూ ట్వీట్‌ చేశారు.

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని ఆశ్రయించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే  ఆరోపణలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై  ఏర్పాటైన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను బహిష్కరించాలని  సిఫారసు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంటూ ఆమెపై  కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీల నివేదికను రూపొందించింది. అయితే ఇది విడుదలకు ముందే మీడియాకు లీక్‌  అయింది.  ఇది ఇలా ఉంటే ఎథిక్స్‌ ఆరోపణలను  మొయిత్రా తోసిపుచ్చారు.  బీజేపీ సర్కార్‌కు గట్టిగా  ఎదురు నిలబడిన కారణంగానే తనను టార్గెట్‌ని చేశారని ఆరోపించిన  సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement