అన్నలా, తమ్ముడిలా ఆదుకున్నారన్న మహిళలు
ఇంటివద్దకే సంక్షేమం, సుపరిపాలన వచ్చిందంటున్న ఓటర్లు
జగన్ పాలనకే జై కొడుతున్న చేతివృత్తిదారులు, రైతులు, కూలీలు
ఆయన రాకపోతే పథకాలు ఆగిపోతాయేమోనని ఆందోళన
‘సాక్షి రోడ్ షో’లో విశాఖపట్నం, అనంతపురం జిల్లాల ఓటర్ల మనోగతం
పథకాలతో జగన్ మాకు డబ్బులు పంచలేదు. ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికంపై పోరాటంలో సాయపడ్డారు. మధ్య తరగతి ప్రజలను కష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కించారు. మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు.. స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించారు. విలేజ్ క్లినిక్‌లతో మా ఆరోగ్యాన్ని కాపాడారు. మహిళలకు ఒక అన్నలా, తమ్ముడిలా ఆర్థికంగా అండగా ఉండి తమ కుటుంబాలను అప్పుల ఊబి నుంచి గట్టున పడేశారు. పెద్ద కొడుకులా మలి వయసులో వృద్ధుల్ని ఆదుకున్నారు. ఇంటివద్దకే సంక్షేమం, సుపరిపాలనతో పాలనాదక్షతను చాటిచెప్పారు. ఏదేమైనా మరోసారి జగన్‌కు ఓటేస్తే ఈ సంక్షేమం కొనసాగడంతో పాటు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని రాష్ట్రంలోని ఓటర్లు ‘సాక్షి రోడ్‌షో’లో అభిప్రాయపడ్డారు.
మరో 10 రోజుల్లో ఎన్నికలు.. రాష్ట్రంలో ఎటు చూసినా ఎన్నికల కోలాహలం .. ఎవరికి ఓటర్లు పట్టం కడతారు? అని ఒకటే చర్చ.. ‘సాక్షి రోడ్‌షో’లో భాగంగా ప్రత్యేక బృందం పల్లెలు, పట్టణాల్లో రచ్చబండలు, పంట పొలాలు, రోడ్ల కూడళ్లు, కిళ్లీ షాపులు, ఆటోస్టాండ్‌లు, మార్కెట్లు ఇలా వీలున్న చోటుకు వెళ్లి ఓటర్లను పలకరించింది. చేనేతకారులు, రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు, రైతులు, మహిళలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలతో ముచ్చటించింది. ఎవరికి.. ఎందుకు ఓటేస్తామో ‘సాక్షి’ రోడ్ షోలో ఓటర్లు స్పష్టం చేశారు.
అనంతపురంజిల్లా రోడ్ షో
మేలు చేసిన వారిని మరిచిపోలేం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 70 కిలోమీటర్ల పరిధిలోని ఓటర్లను సాక్షి రోడ్ షో బృందం పలకరించింది. మాకు రాజకీయాలతో పనిలేదు.. సాయం చేసిన వారికి అండగా నిలుస్తామని కొందరు చెబితే.. మహిళలు, చేతివృత్తిదారులు, కూలీలు, రైతులు, వృద్ధులు తమకు సాయం చేసిన జగన్‌కు ఓటేస్తామని నిర్మొహమాటంగా పేర్కొన్నారు. జిల్లాలో అనంతపురం, రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో 75 కిలోమీటర్లు సాగిన రోడ్‌షోæలో ఓటర్ల మనోగతం ఇది..
(జి.రామచంద్రారెడ్డి/బి.నగేష్, అనంతపురం)
అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో..
ఉదయం 7.20 గంటలకు అనంతపురం కలెక్టరేట్ వద్దకు వెళ్తే ఫరీద్, రాము టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. జగన్ మళ్లీ గెలుస్తాడని ఫరీద్ చెబితే.. తాను పక్కా టీడీపీ అని అయినా ఈసారి అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి గెలుస్తాడని రాము చెప్పాడు. అక్కడ నుంచి కందుకూరు వైపు రాప్తాడు నియోజకవర్గం వెళ్తుండగా మధ్యలో ఇటుకల బట్టీ వద్ద ఆగి కూలి పని చేస్తున్న మాధవితో మాట్లాడితే.. తనకు ఏటా రూ.9,100 చొప్పున డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అందాయని, అర్హత ఉన్న పథకాలన్నీ వచ్చాయని చెప్పింది.
కందుకూరు శివారులో..
ఉదయం 8.10: కందుకూరు శివారులోని జగనన్న కాలనీ వద్ద ఆగాం. లబ్ధిదారులు ఈడిగ మహేశ్వరి, సరస్వతి, లక్ష్మీదేవి లు మాట్లాడుతూ.. ‘ఇక్కడ సెంటు రూ. 3 లక్షలకు పైగా ఉంది. మాకు సెంటున్నర స్థలం ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించారు. జగన్ సాయం మరచిపోలేం’ అన్నారు. కందుకూరులో ఓ అరుగుపై తలారి ఓబుళపతి, సాకే నారాయణ, ఆర్.నారప్పరెడ్డి, రాగే యల్లప్ప కూర్చుని ఉండగా పలకరించాం. పరిటాల సునీతను రెండుసార్లు గెలిపించినా తమ ఊరికి రోడ్డు కూడా వేయించలేదని.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయ్యాక రోడ్డుకు మోక్షం వచ్చిందన్నారు. జగన్ పాలనలో ఇంటికే పథకాలు అందుతున్నాయని చెప్పారు.
ధర్మవరం మండలం చిగిచెర్లలో..
ఉదయం 9.20: ధర్మవరం మండలం చిగిచెర్లలో టైలర్ మాబు తారసపడ్డారు. ‘జగన్ సొమ్ము తిని ఎలా మరచిపోతాం. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడు. నా ఇద్దరు కూతుళ్లకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందించారు. నా భార్యకు రూ.70 వేలు డ్వాక్రా రుణ మాఫీ డబ్బులు వేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి పట్టించుకోలేదు’ అని మనసులో మాట బయటపెట్టాడు. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌లో.. పెద్దన్నను పలకరించగా.. ‘మాకు అమ్మఒడి, ఆసరా పథకాలు అందాయి. నాకు వృద్ధాప్య పింఛన్ రూ. 3 వేలు వస్తోంది. ప్రతి నెలా వలంటీరు తెచ్చేవాడు. వలంటీర్లు వద్దని ఎవరో చెప్పారంట ఏప్రిల్‌లో ఇంటికి రాలేదు. తెచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డాం’ అని చెప్పాడు.
ధర్మవరం శివారు ఇందిరమ్మ కాలనీలో..
ఉదయం 10.10: ధర్మవరం శివారులోని ఇందిరమ్మకాలనీ.. చేనేత కార్మికులైన పల్లా రంగయ్య, నాగరత్నమ్మ ఇంటికి వెళ్లాం. ఇద్దరూ చీర నేస్తుండగా పలకరించాం.. ‘వైఎస్సార్ హయాంలో మాకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించారు. జగన్ వచ్చాక నేతన్ననేస్తంలో ఏటా రూ. 24 వేలు ఇస్తున్నారు. కరోనా సమయంలో చేసిన సాయం మరిచిపోలేం. మా ముగ్గురు కూతుళ్లకు రెండు నెలల వ్యవధిలోనే కాన్పులు చేశాం. ఆ సమయంలో జగనన్న సాయం చేశాడు. జగన్‌కే ఓటు’ అని చెప్పారు.
చెన్నేకొత్తపల్లిలో
ఉదయం 11 గంటలకు: చెన్నేకొత్తపల్లికి చేరుకున్నాం. టీస్టాల్ నిర్వాహకుడు దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊరిలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయన్నాడు. నాగసముద్రం పంచాయతీ పల్లెన్నగారిపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మళ్లీ జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయనే భయం ఓటర్లలో ఉందన్నాడు. అనంతరం పెనుకొండ మండలం గుట్టూరులో ఆటోడ్రైవరు ఆంజనేయులుతో మాట్లాడాం. మా కుటుంబానికి రూ.5 లక్షలకు పైగా లబ్ధి జరిగింది. పథకాల కోసం ఏ నాయకుడి వద్దకు, అధికారి వద్దకు వెళ్లలేదు. వలంటీరు వచ్చి రాసుకుని వెళ్లేవాడు.’ అని చెప్పాడు.
ప్యాదిండి సమీపంలో..
ధర్మవరం నుంచి ప్యాదిండి మీదుగా ఎన్‌ఎస్ గేట్ వైపు వెళ్లగా.. మధ్యలో చీనీ తోటలో కూర్చున్న రైతులు భాస్కర్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడాం. తమకు ఏటా సగటున రూ.లక్ష వరకు పంటల బీమా వచ్చిందన్నారు. ఏటా రూ. 13,500 రైతు భరోసా వస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో మండల కేంద్రానికి వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పాయన్నారు.
పెనుకొండ పట్టణంలో..
మధ్యాహ్నం 12 గంటలకు: మునిమడుగులో ఆటో డ్రైవర్ మహిధర్, హోటల్ నిర్వాహకురాలు రాధమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి సంక్షేమ పథకం అందిందని చెప్పారు. మధ్యాహ్నం పెనుకొండ పట్టణంలో రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆంజనేయులును కలవగా.. ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో పేదలకు సాయం జరిగిందని.. సాయం చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. అంతకు ముందు చెన్నేకొత్తపల్లిలో రామాంజనేయులు మాట్లాడుతూ తాను టీడీపీ అభిమానినని, ఈ ప్రభుత్వంలో ఎవరి సిఫార్సు లేకుండానే సంక్షేమ పథకాలు అందాయమన్నారు. అర్హత ఉన్న ప్రతి పథకం అందిందన్నారు. పెనుకొండలో రామకృష్ణ మాట్లాడుతూ పథకాలు నిష్పక్షపాతంగా అందాయని.. ఓటు మాత్రం ఎవరికి వేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
విశాఖ జిల్లా రోడ్ షో
పాలన బాగుంది.. మరోసారి అవకాశం
పల్లె, పట్టణం, ఊరు, వాడ ఎటు చూసినా ఫ్యాన్ గాలే.. పేద.. ధనిక.. అవ్వా తాత.. అక్కా చెల్లి.. అన్నా.. తమ్ముడు.. ఎవర్ని అడిగినా జగనే అన్నారు. సుపరిపాలనే జగనన్న పాలనకు శ్రీరామరక్ష అని ఆటో డ్రైవర్ అంటే.. ఇంటి దగ్గరకే సంక్షేమాన్ని అందించడం నచ్చిందని కిరాణా కొట్టు మహిళ చెప్పింది. మాకు సాయపడ్డ జగన్‌కే ఓటేస్తామని కొబ్బరి బొండాలమ్మే వ్యక్తి చెప్పగా.. చంద్రబాబు కంటే.. అన్నదాతని ఆదుకున్న జగన్ వెయ్యి రెట్లు మేలని రైతు బదులిచ్చారు. ఇసుక విధానం మార్చితే బాగుంటుందని ఓ మేస్త్రీ అభిప్రాయపడ్డాడు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సాక్షి రోడ్‌షోలో అత్యధిక శాతం జగన్ పాలన బాగుందని, మరోసారి అవకాశం ఇస్తామని చెప్పారు. విశాఖపట్నంలోని ఉత్తర నియోజకవర్గం నుంచి తూర్పు, భీమిలి, పెందుర్తి మీదుగా అనకాపల్లి జిల్లాలోని మాడుగుల, చోడవరం, అనకాపల్లి వరకూ సాగిన రోడ్‌షోలో ఓటర్ల మనోగతం ఇది..
–కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం
బాలయ్య శాస్త్రి లేఅవుట్(విశాఖ ఉత్తరం)
ఉదయం 8.30 గంటలు: కొబ్బరి బొండాలు కొడుతున్న రాజుని పలకరించగా.. మనకెందుకు బాబాయ్ రాజకీయాల గురించి.. అంటూ తటపటాయించాడు. ఏ పార్టీ ఈసారి గెలిస్తే బాగుంటుందని అడగ్గా..
‘ఇక్కడైతే కేకే రాజు పక్కా.. కరోనా రోజుల్లో ప్రతి ఇంటికీ భరోసా ఇచ్చారు. పైన మాత్రం జగనే వస్తాడు. మా బంధువుల్లో ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం ఇచ్చారు. చాలా కుటుంబాలు బాగుపడ్డాయి’ అని చెప్పాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే.. రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఇస్త్రీ బండి దగ్గర ఉన్న సన్యాసిరావులు కూడా జగన్ రావచ్చని చెప్పారు.
హనుమంతవాక జంక్షన్(విశాఖ తూర్పు)
ఉదయం 9 గంటలు: ఆటోడ్రైవర్‌లు చిన్ని, పాండురంగను పలకరించగా.. ఈ సారి జనసేన వస్తుందని చిన్ని చెప్పగా.. 100 శాతం జగనేనండీ అంటూ పాండు సమాధానమిచ్చాడు.
పాండు : 21 సీట్లతో జనసేన
ఎలా వస్తుందిరా.?
చిన్ని: 21 కాదు.. 25
పాండు : 25 కాదు.. 50 అనుకో..
పవన్ సీఎం అవుతారా.? చూడండి..
ఎవరేమనుకున్నా.. జగనే మళ్లీ సీఎం అవుతారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబు, ఎంవీవీ సత్యనారాయణ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అయితే రాష్ట్రంలో మాత్రం జగన్ మళ్లీ సీఎం అవుతారు అని పాండు అన్నాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లగా.. ఫ్రూట్‌జ్యూస్ అమ్ముతున్న శ్రీను మాత్రం ఎవరొస్తారో చెప్పలేమన్నారు. ముందుకెళ్లి టిఫిన్ సెంటర్ చందుని అడిగితే జగన్ పక్కా అంటూ నవ్వుతూ తన పనిలో మునిగిపోయాడు.
సింహాచలం కొండ దిగువన..
ఉదయం 10 గంటలకు: భీమిలి పరిధిలోని సింహాచలం కొండ దిగువన ఆగగా.. వృద్ధురాలు కనిపించింది. మళ్లీ ఎవరొస్తారని అడగ్గా.. ‘చంద్రబాబు రాకూడదు. మాఊళ్లో అందరి జీవితాలు అతని వల్లే పోయాయి. పంచగ్రామాల సమస్య పరిష్కారం కాలేదు. కోర్టుకెళ్లడానికి కారణం చంద్రబాబే. పవన్ ఒక్కడొచ్చుంటే మా కులపోడని ఆలోసించేవాళ్లమేమో. ఇప్పుడది కూడా పోయింది’ అంటూ ఆటో ఎక్కేసింది. పక్కనే ఉన్న సెలూన్ షాప్ ఈశ్వర్, పూల దుకాణం మస్తాను ఫ్యాన్ గ్యారెంటీ అన్నారు.
పెందుర్తి నియోజకవర్గం గాంధీనగర్‌లో..
ఉదయం 11 గంటలకు:నేరుగా పెందుర్తి నియోజకవర్గంలోని గాంధీనగర్‌లో కొత్తగా నిర్మించిన యూపీహెచ్‌సీకి వెళ్లగా.. తాపీ మేస్త్రీ రామారావు కనిపించాడు. ‘జగన్ బాగా సెయ్యలేదని మేం సెప్పట్లేదు. మా పిల్లలకు మంచి సదువు ఇచ్చారు. ఆస్పత్రి పెట్టి మాకు వైద్యం ఇచ్చినాడు. ఏ ఇబ్బంది వచ్చినా.. ఇక్కడికే ముందు వస్తాం. మందులన్నీ మంచిగా ఇస్తారు. ఒక్క ఇసక ఇషయంలో మాత్రం ఇబ్బంది పడ్డాం’ అని చెప్పుకొచ్చాడు. పెందుర్తి, పినగాడి నుంచి.. సబ్బవరం మండలం గుల్లేపల్లి మీదుగా వెళ్తుండగా.. కల్లుగీత కార్మికుడు లావేటి వెంకట్రావు తారసపడ్డాడు. ‘మేము తీసే కల్లు లాగే మా జగన్ ప్యూర్. జగన్ అంటేనే నిలువెత్తు నమ్మకం. చంద్రబాబు కల్పితాలు ఎన్నయినా చెప్పొచ్చు. కానీ చేసి చూపించింది మాత్రం జగన్ ఒక్కడే’ అన్నాడు.
మాడుగుల మండలం కె.కోటపాడులో..
మధ్యాహ్నం 12.30 గంటలకు: మాడుగుల మండలం కె.కోటపాడు వెళ్లి నారాయణమ్మ అనే మహిళను పలకరించాం. ‘ మా ఆయనకు కాలు, చేయి పనిచేయదు. జగన్ మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతి నెలా ఇంటికే పెన్షన్ ఇస్తున్నారు. చేయూతలో రూ.18,750తో చిన్న కొట్టు పెట్టుకున్నాను. ఆ షాపుపై రుణం వచ్చింది. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు’ అని ఆనందంగా చెప్పింది.
పీఎస్‌పేట(చోడవరం నియోజకవర్గం, విశాఖ రోడ్‌షో)
మధ్యాహ్నం ఒంటి గంటకు: చోడవరం నియోజకవర్గం పీఎస్ పేటలో చెరకు రైతుల్ని పలకరించాం. రైతు తలారి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ హయాంలో రెండు రాçష్ట్రాల్లో 28 కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలుంటే.. చంద్రబాబు వచ్చాక గోవాడ ఒక్కటే మిగిలింది. ఆ ఫ్యాక్టరీని చంద్రబాబు రూ.120 కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. జగన్ వచ్చాక ఆ అప్పుల్ని తగ్గించారు. ఫ్యాక్టరీ నడిపేందుకు రూ.80 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. మళ్లీ జగన్ వస్తేనే ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు. ఒక్క రూపాయి చెల్లించలేదు. నా దగ్గర బాండు ఉంది చూపిస్తాను’ అన్నాడు. మిగిలిన రైతులు నాయుడు, వెంకట్రావు, సూర్యనారాయణ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనకాపల్లి వైపు వెళ్తుండగా.. రిటైర్డ్ ఉద్యోగి కేవీ గౌరీపతిని పలకరించగా.. ‘అనకాపల్లి జిల్లా కేంద్రం కావాలన్న కలని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ లోకల్ నేత బూడి ముత్యాల నాయుడిని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment