Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా? | Sakshi
Sakshi News home page

Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?

Published Wed, Mar 20 2024 12:59 PM

Yellow media wrong conclusion in favour of Chandrababu and Revanth - Sakshi

బాబు ఎమ్మెల్యేలని కొంటే ప్రకృతి కూల్‌గా ఉంటుందట.!

YSR చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతి ప్రకోపించిందట.!

చంద్రబాబు చర్యలకు ఎల్లో మీడియా వక్రభాష్యం

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు  రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి  ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ  ఎంపీలు, ఎమ్మెల్యేలను  కాంగ్రెస్ లో చేర్చుకుంటే  ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని  పొలిటికల్  ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను  తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను  కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం  వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి  ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని  ప్రస్తుత  తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్.  హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి  ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు.  కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు.

రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి  అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేసి  కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు.  మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట?  వై.ఎస్.ఆర్.   టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే   పగ బట్టేసిన ప్రకృతి   చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను  టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి  మంత్రి పదవులు ఇచ్చినా   ప్రకృతి   ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్.  తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని  అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు  ఎలా వ్యవహరించినా  ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు  2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు  ఏపీ అద్బుతంగా ఉందని  భజన చేసింది ఎల్లో మీడియా.  బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం  రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ  గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి  పైత్యపు కూతలు కొత్త కాదు.  

సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ  భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి  మాత్రం ప్రకృతి విషయంలో  కొంచెం జాగ్రత్తగా ఉండాలని  ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే  బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ  రేవంత్ రెడ్డి పార్టీ  చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి  మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి  బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు.

- సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్

Advertisement
 

తప్పక చదవండి

Advertisement