MI Vs LSG, IPL 2023 Eliminator: Krunal Pandya Comments After Match - Sakshi
Sakshi News home page

IPL 2023 Eliminator MI VS LSG: నాదే బాధ్యత.. డికాక్‌ గొప్ప బ్యాటరే, అతనికి మంచి రికార్డు ఉందని..!

Published Thu, May 25 2023 9:04 AM

IPL 2023 Eliminator MI VS LSG: Krunal Pandya Comments After Match - Sakshi

ఐపీఎల్‌ 2023లో భాగంగా నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓటమిపాలైంది. ఫలితంగా వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్‌ గండం దాటలేక లీగ్‌ నుంచి నిష్క్రమించింది. ముంబై పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ (3.3-0-5-5) లక్నోను ఇంటిబాట పట్టేలా చేశాడు. బ్యాటింగ్‌ వైఫల్యం, కెప్టెన్‌ తప్పుడు నిర్ణయాలు (డికాక్‌ను కాదని కైల్‌ మేయర్స్‌కు అవకాశం ఇవ్వడం) ఎల్‌ఎస్‌జీ కొంపముంచాయి.

మ్యాచ్‌ అనంతరం ఈ విషయాలపై లక్నో కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌ వైఫల్యానికి తనదే బాధ్యత అని ఒప్పుకున్నాడు. బ్యాటింగ్‌ సైతం సజావుగా సాగుతున్న సమయంలో (8.1 ఓవర్లలో 69/2) అనవసర షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నానని, దాని వల్లే తమ బ్యాటింగ్‌ లయ తప్పిందని తెలిపాడు. రాంగ్‌ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నానని,  దాని పూర్తి బాధ్యత తనదేనని అన్నాడు.

బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తోండిందని, తాము మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉండిందని తెలిపాడు. స్ట్రాటజిక్‌ బ్రేక్‌ తర్వాత చెత్త క్రికెట్ ఆడామని, అంతకు వెయ్యి రెట్లు మెరుగైన క్రికెట్‌ ఆడాల్సిందని పేర్కొన్నాడు. డికాక్‌ను కాదని కైల్‌ మేయర్స్‌ను తీసుకోవడంపై స్పందిస్తూ..  డికాక్‌ నాణ్యమైన బ్యాటర్ అయినప్పటికీ చెన్నైలో మేయర్స్‌కు మెరుగైన రికార్ ఉండటంతో అతనివైపే మొగ్గు చూపాల్సి వచ్చిందని వివరించాడు.

పేసర్లను కాదని స్పిన్‌ బౌలింగ్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంపై మాట్లాడుతూ.. ముంబై బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లను బాగా ఆడగలరని భావించామని, అందుకే స్పిన్‌ అటాక్‌తో బౌలింగ్‌ ప్రారంభించామని చెప్పుకొచ్చాడు. ఆకాశ్‌ మధ్వాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, ముంబై ప్లేయర్లు ఫీల్డ్‌లో పాదరసంలా కదిలారని ప్రశంసించాడు. ఓవరాల్‌గా జట్టు ఓటమి బాధ్యత తానే తీసుకుంటానని, తప్పుడు నిర్ణయాలే కొంపముంచాయని తెలిపాడు. 

కాగా, నిన్నటి పోరులో లక్నోపై ముంబై 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్‌ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది.

చదవండి: సపోర్ట్‌ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్‌ ఉందని ముందే పసిగట్టాను: రోహిత్‌ శర్మ

Advertisement
 
Advertisement
 
Advertisement