విశాఖలో పరుగుల సంద్రం | Sakshi
Sakshi News home page

విశాఖలో పరుగుల సంద్రం

Published Thu, Apr 4 2024 3:56 AM

KKR won by 106 runs against Delhi - Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్కోరు 272/7 

ఢిల్లీపై 106 పరుగులతో గెలుపు

చెలరేగిన నరైన్, అంగ్‌కృష్, రసెల్‌

సరిగ్గా వారం రోజుల క్రితం... గత బుధవారం హైదరాబాద్‌ గడ్డపై సన్‌రైజర్స్‌ భీకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఇప్పుడు ఈ బుధవారం విశాఖపట్నం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదే తరహా పరుగుల విధ్వంసరచన చేసింది. రికార్డు స్కోరుకు చేరువగా వచ్చి త్రుటిలో దానిని అందుకోలేకపోయినా ... ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరును కోల్‌కతా సాధించింది.

సునీల్‌ నరైన్, అంగ్‌కృష్‌ రఘువంశీ, రసెల్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు... ఆ తర్వాత భారీ స్కోరు చూసి ముందే తలవంచిన ఢిల్లీ లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది. కోల్‌కతా ఖాతాలో హ్యాట్రిక్‌ విజయం చేరగా... ఢిల్లీ మళ్లీ ఓటమి బాట పట్టింది.   

సాక్షి, విశాఖపట్నం: మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) తాజా సీజన్‌ ఐపీఎల్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన పోరులో కేకేఆర్‌ 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌ (277) తర్వాత ఇదే రెండో అత్యధిక స్కోరు. సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేయగా... అంగ్‌కృష్‌ రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అంతే జోరుతో అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 48 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు.

ఆ తర్వాత ఆండ్రీ రసెల్‌ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడు కేకేఆర్‌కు భారీ స్కోరును అందించింది. అనంతరం ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.  

శతక భాగస్వామ్యం... 
తొలి ఓవర్లో ఎక్స్‌ట్రాల రూపంలోనే 7 పరుగులతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం కాగా... తర్వాతి రెండు ఓవర్లలో సాల్ట్‌ (12 బంతుల్లో 18; 4 ఫోర్లు), నరైన్‌ కలిసి 25 పరుగులు రాబట్టారు. అయితే రైడర్స్‌ అసలు జోరు ఇషాంత్‌ వేసిన నాలుగో ఓవర్లో మొదలైంది. నరైన్‌ వరుసగా 6, 6, 4, 0, 6, 4 బాది ఏకంగా 26 పరుగులు సాధించడం విశేషం. సాల్ట్‌ వెనుదిరిగిన తర్వాత నరైన్‌తో రఘువంశీ జత కలిశాక కోల్‌కతా మరింత వేగంగా దూసుకుపోయింది.

సలామ్‌ ఓవర్లో నరైన్‌ 3 ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. 21 బంతుల్లోనే నరైన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అక్షర్‌ కూడా వేసిన ఒక్క ఓవర్లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. సుమీత్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రఘు... సలామ్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో చెలరేగాడు. ఎట్టకేలకు 13వ ఓవర్లో మార్‌‡్ష ఈ జోడీని విడదీశాడు. టి20ల్లో తన అత్యధిక స్కోరు సాధించిన నరైన్‌ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... మరోవైపు 25 బంతుల్లో రఘు హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు.

రఘువంశీ కూడా వెనుదిరిగిన తర్వాత రసెల్‌ తన స్థాయిని ప్రదర్శిస్తూ బౌండరీలతో చెలరేగుతూ స్కోరును 200 పరుగులు దాటించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (18) అవుటైన తర్వాత నోర్జే ఓవర్లో 3 సిక్స్‌లు, ఫోర్‌ బాది రింకూ సింగ్‌ (8 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. మరో 14 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసే లక్ష్యంతో చివరి ఓవర్లో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు సిద్ధమైంది. అయితే ఇషాంత్‌ అద్భుత యార్కర్‌తో తొలి బంతికే రసెల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో ఆ ఆశలకు తెర పడింది.  

పంత్‌ మెరుపులు... 
భారీ ఛేదనలో ఢిల్లీ తడబడింది. 12 పరుగుల వ్యవధిలో ఆ జట్టు తొలి 4 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (10), మార్‌‡్ష (0), పొరేల్‌ (0), వార్నర్‌ (18) ప్రభావం చూపలేకపోవడంతో గెలుపుపై నమ్మకం ఇక్కడే సడలింది. అనంతరం కొద్ది సేపు పంత్‌ మెరుపు బ్యాటింగ్‌ క్యాపిటల్స్‌ అభిమానులకు ఆనందం పంచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలచిన అతను రసెల్‌ ఓవర్లో మరో 2 సిక్స్‌లు బాదాడు.

ఆ తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన 12వ ఓవర్లో పంత్‌ బ్యాటింగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4, 4తో అతను 28 పరుగులు రాబట్టడం విశేషం. అయితే తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరగడంతో ఢిల్లీ మిగతా ఆట లాంఛనమే అయింది. స్టబ్స్‌ కూడా కొంత పోరాడినా లాభం లేకపోయింది.  

స్కోరు వివరాలు 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) స్టబ్స్‌ (బి) నోర్జే 18; నరైన్‌ (సి) పంత్‌ (బి) మార్‌‡్ష 85; రఘువంశీ (సి) ఇషాంత్‌ (బి) నోర్జే 54; రసెల్‌ (బి) ఇషాంత్‌ 41; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) స్టబ్స్‌ (బి) అహ్మద్‌ 18; రింకూ (సి) వార్నర్‌ (బి) నోర్జే 26; వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 5; రమణ్‌దీప్‌ (సి) పృథ్వీ షా (బి) ఇషాంత్‌ 2; స్టార్క్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 272. వికెట్ల పతనం: 1–60, 2–164, 3–176, 4–232, 5–264, 6–264, 7–266. బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–43–1, ఇషాంత్‌ శర్మ 3–0–43–2, నోర్జే 4–0–59–3, సలామ్‌ 3–0–47–0, సుమీత్‌ 2–0–19–0, అక్షర్‌ 1–0–18–0, మార్‌‡్ష 3–0–37–1.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) స్టార్క్‌ 18; పృథ్వీ షా (సి) వరుణ్‌ (బి) వైభవ్‌ 10; మార్‌‡్ష (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 0; పొరేల్‌ (సి) నరైన్‌ (బి) వైభవ్‌ 0; పంత్‌ (సి) శ్రేయస్‌ (బి) వరుణ్‌ 55; స్టబ్స్‌ (సి) స్టార్క్‌ (బి) వరుణ్‌ 54; అక్షర్‌ (సి) (సబ్‌) పాండే (బి) వరుణ్‌ 0; సుమీత్‌ (సి) (సబ్‌) పాండే (బి) నరైన్‌ 7; సలామ్‌ (సి) సాల్ట్‌ (బి) వైభవ్‌ 1; నోర్జే (సి) శ్రేయస్‌ (బి) రసెల్‌ 4; ఇషాంత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్‌) 166. వికెట్ల పతనం: 1–21, 2–26, 3–27, 4–33, 5–126, 6–126, 7–159, 8–159, 9–161, 10–166. బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–25–2, వైభవ్‌ 4–0–27–3, రసెల్‌ 1.2–0–14–1, నరైన్‌ 4–0–29–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–33–3, వెంకటేశ్‌ 1–0–28–0.  

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌  X  పంజాబ్‌ 
వేదిక: అహ్మదాబాద్‌ 

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement
Advertisement