కౌంట్‌డౌన్‌ @100 | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ @100

Published Wed, Apr 17 2024 4:10 AM

Paris Olympics in another hundred days - Sakshi

మరో వంద రోజుల్లో పారిస్‌ ఒలింపిక్స్‌ 

గ్రీస్‌లో జ్యోతి ప్రజ్వలనం

ఒలింపియా (గ్రీస్‌): ప్రపంచ క్రీడా పండుగ పారిస్‌ ఒలింపిక్స్‌–2024కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 100 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఒలింపిక్స్‌ పుట్టిల్లు గ్రీస్‌లో జ్యోతి ప్రజ్వలన ఘట్టాన్ని నిర్వహించారు. తొలి ఒలింపిక్స్‌ నిర్వహించిన ప్రాచీన ఒలింపియాలో ఈ ఆకర్షణీయమైన కార్యక్రమం జరిగింది. ప్రాచీన సంప్రదాయ వేషధారణలో గ్రీక్‌ నటి మారియా మినా జ్యోతిని వెలిగించింది.

సాధారణంగా సూర్య కిరణాలను అక్కడే ఉంచిన ప్రత్యేక అద్దంపై ప్రసరింపజేసి దాని ద్వారా జ్యోతిని వెలిగిస్తారు. అయితే మంగళవారం అంతా చల్లగా మారి వాతావరణంగా అనుకూలంగా లేకుండా పోయింది. దాంతో అక్కడ అందుబాటులో ఉంచిన ఇతర ప్రత్యామ్నాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

లాంఛనం ముగిసిన తర్వాత తొలి టార్చ్‌ను రోయింగ్‌లో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అయిన గ్రీస్‌ ఆటగాడు స్టెఫనోస్‌ డూస్కస్‌ అందుకోగా...రెండో టార్చ్‌ బేరర్‌గా ఆతిథ్య ఫ్రాన్స్‌కు చెందిన మాజీ ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌ లారా మనాడూ నిలిచింది. ఈ టార్చ్‌ ఇక్కడినుంచి మొదలై గ్రీస్‌ దేశంలో సుమారు 5 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఏప్రిల్‌ 26న పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ వద్దకు ఇది చేరుతుంది. అనంతరం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు కూడా దీనిని తీసుకెళతారు.  
 

Advertisement
Advertisement