ఉబెర్‌ కప్‌ టోర్నీకి సింధు దూరం | Sakshi
Sakshi News home page

ఉబెర్‌ కప్‌ టోర్నీకి సింధు దూరం

Published Fri, Apr 5 2024 3:52 AM

Sindhu is far from the Uber Cup tournament - Sakshi

గాయత్రి–ట్రెసా, అశ్విని–తనీషా జోడీలు కూడా అవుట్‌ 

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఉబెర్‌ కప్‌ మహిళల టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఈసారి భారత ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీ ఏప్రిల్‌ 27 నుంచి మే 5 వరకు చైనాలోని చెంగ్డూలో జరగనుంది. సింగిల్స్‌ విభాగం నుంచి స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు తప్పుకోగా... డబుల్స్‌ విభాగం నుంచి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ; అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీలు కూడా వైదొలిగాయి.

పారిస్‌ ఒలింపిక్స్‌కల్లా తన ఆటలో మరింత పదును పెరిగేందుకు, పూర్తి ఫిట్‌గా ఉండేందుకు సింధు ఉబెర్‌ కప్‌ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు దక్కించుకోవాలనే లక్ష్యంతో గాయత్రి–ట్రెసా, అశ్విని–తనీషా జోడీలు ఇతర క్వాలిఫయింగ్‌ టోర్నీలపై దృష్టి పెట్టాయి.

భారత మహిళల జట్టు ఉబెర్‌కప్‌లో మూడుసార్లు (1957, 2014, 2016) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. 

భారత మహిళల జట్టు: అన్‌మోల్, తన్వీ శర్మ, అష్మిత, ఇషారాణి బారువా (సింగిల్స్‌); శ్రుతి మిశ్రా, ప్రియా కొంజెంగ్‌బమ్, సిమ్రన్, రితిక (డబుల్స్‌). భారత పురుషుల జట్టు: ప్రణయ్, లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రియాన్షు, కిరణ్‌ జార్జి (సింగిల్స్‌); సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, అర్జున్, ధ్రువ్‌ కపిల, సాయిప్రతీక్‌ (డబుల్స్‌). 

ఆసియా చాంపియన్‌షిప్‌ నుంచి వైదొలిగిన సాత్విక్‌ జోడీ  భుజం గాయం నుంచి సాత్విక్‌ పూర్తిగా కోలుకోకపోవడంతో... ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నుంచి సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ వైదొలిగింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.

థామస్‌ కప్‌లో మాత్రం సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం బరిలోకి దిగుతుందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం తెలిపింది. ఆసియా చాంపియన్‌షిప్‌ ఈనెల 9 నుంచి 14 వరకు చైనాలో జరుగుతుంది.   
 

Advertisement
 
Advertisement