
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ. విజయవాడకు చెందిన లయ మొదటి సినిమా 'స్వయంవరం'తోనే పలు అవకాశాలను అందుకుని ఎన్నో అవార్డులు సాదించింది. గ్లామర్ రోల్స్ కన్న నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన లయ, ఎన్నారై శ్రీ గణేశన్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి కాలిఫోర్నియాలోనే ఉంటూ అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంది.

లయ హీరోయిన్‌గా పరిచయం అయి 25 ఏళ్లు అవుతుంది. తన మొదటి సినిమా స్వయంవరం చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యలో పాల్గొంది. సోషల్ మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయింది. వాస్తవంగా తాను సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటాను. దీంతో అలాంటి వార్తలు వచ్చినప్పుడు కొందరు నిజంగానే నమ్మే అవకాశం ఉందని ఆమె తెలిపింది. తన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదని, కుటుంబాన్ని పోషించేందుకు టీ అమ్ముకుని బతుకుతున్నట్లు దారుణమైన వార్తలు రాశారని లయ బాధ పడింది. అవి చూసిన తన కుటుంబ సభ్యులు అందరూ చాలా బాధ పడ్డారని పేర్కొంది.
తనకు నచ్చని సినిమా గురించి లయ ఇలా చెప్పారు.. 'నేను నటించిన స్వయంవరం వచ్చి ఇప్పటికి 25 ఏళ్లు అయింది. అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒక సినిమా హిట్ అయిన తర్వాత సహజంగా ఏ హీరోయిన్ అయినా సరే భారీ సినిమానే ప్లాన్ చేస్తుంది. కానీ, నేను మాత్రం మా బాలాజీ అనే సినిమాలో విడో పాత్ర చేసి తప్పు చేశాననిపించింది. సినిమా బాగుంది. కానీ ఆ సమయంలో నేను చేయకుండా ఉండుంటే మరింత బాగుండేది.

అలాంటి సినిమాలో మరో మూడు ఉన్నాయి. ఈరోజుల్లో ఉండే హీరోయిన్‌లు అయితే అలాంటి తప్పు చేయడం లేదు. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా టైమ్ బాగుండటం వల్ల ఆ తర్వాత కూడా నాకు మంచి అవకాశాలు వచ్చాయి.' అని ఆమె తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత లయ మళ్లీ వెండతెరపై కనిపించనున్నారు. నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఆమె ఒక కీలకపాత్రలో కనిపించనుంది. అవకాశాలు వస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తానని కూడా ఆమె చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment