పరుగుల ధమాకాకు భారత్‌ సిద్ధం  | Sakshi
Sakshi News home page

పరుగుల ధమాకాకు భారత్‌ సిద్ధం 

Published Sun, Nov 12 2023 2:45 AM

Today is the last league match of the World Cup - Sakshi

ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన...ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగుతూ విజయాల్లో తమ భాగస్వామ్యం...ఎదురు లేని ఆటతో దూసుకుపోతున్న భారత జట్టు ప్రపంచకప్‌లో లీగ్‌ దశను అజేయంగా ముగించేందుకు సిద్ధమైంది. ఎనిమిది వరుస విజయాల తర్వాత చివరి పోరులోనూ నెగ్గి స్కోరును 9/9కు చేర్చాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పెద్ద పెద్ద జట్లే రోహిత్‌ సేన ముందు నిలవలేకపోగా...బలహీనమైన నెదర్లాండ్స్‌ ఇప్పుడు ఎదురుగా ఉంది. 

బెంగళూరు: వరల్డ్‌ కప్‌లో ఎప్పుడో సెమీస్‌ స్థానాన్ని ఖాయం చేసుకున్న టీమిండియా వరుసగా తొమ్మిదో విజయాన్ని ఆశిస్తోంది. 2003 ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గింది. ఇప్పుడు మరో మ్యాచ్‌లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది.

ఈ ప్రపంచకప్‌లోనే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ (45వ)లో నేడు నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడుతుంది. బలాబలాలు, అంచనాల ప్రకారం టీమిండియా డచ్‌కంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఈ వరల్డ్‌ కప్‌లో కూడా భారీ స్కోర్లే నమోదు కాగా, మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.  

ప్రసిద్‌కు అవకాశం... 
భారత జట్టు జైత్రయాత్ర చూస్తే తుది జట్టులో నిజానికి ఎలాంటి మార్పులు అవసరం లేదు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌ పోరు గురించే ప్రస్తుతం భారత జట్టు ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుత ప్రత్యర్థిని బట్టి చూస్తే ఒకటి రెండు మార్పులతో బరిలోకి దిగవచ్చు. పేసర్లలో ఒకరిని పక్కన పెట్టిన కొత్తగా జట్టులోకి చేరిన ప్రసిధ్‌ కృష్ణకు అవకాశం కల్పించవచ్చు. కర్నాటకకే చెందిన ప్రసిధ్‌ బరిలోకి దిగితే అతనికి ఇదే తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ అవుతుంది.

చెన్నైలో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌ ఆడిన తర్వాత మిగిలిన 7 మ్యాచ్‌లలో స్పిన్నర్‌ అశ్విన్‌కు చోటు దక్కలేదు. ఇక్కడ కుల్దీప్‌ స్థానంలో అతడిని ఆడించేందుకు అవకాశం ఉంది. మరో వైపు ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో అతని ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలో 49వ సెంచరీతో సచిన్‌ రికార్డు సమం చేసిన కోహ్లి ఇక్కడ 50వ శతకం బాదుతాడా అనేది ఆసక్తికరం.
 
పోటీనిచ్చేనా... 
అక్కడక్కడా కొన్ని మెరుపులు మినహా ఓవరాల్‌గా నెదర్లాండ్స్‌ ఆటతీరు సాధారణంగా ఉంది. పటిష్టమైన భారత్‌కు ఈ టీమ్‌ ఏమాత్రం పోటీనివ్వగలదనేది చూడాలి. ఓపెనర్లు డౌడ్, బరెసి శుభారంభంతో పాటు కెప్టెన్‌ ఎడ్వర్డ్స్, అకెర్‌మన్, డి లీడ్‌ బ్యాటింగ్‌లో... మీకెరెన్, వాన్‌ బీక్‌ బౌలింగ్‌లో అంచనాలకు తగినట్లుగా రాణిస్తే కొంత పోరాడవచ్చు.

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి ఆపై న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ప్రస్తుతం నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తేజ నిడమనూరు తొలిసారి స్వదేశంలో భారత జట్టుపై ఆడనున్నాడు. ఈ క్షణం కోసం తాను ఉద్వేగభరితంగా ఎదురు చూస్తున్నట్లు అతను చెప్పాడు.  

ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ 
భారత్‌  x  న్యూజిలాండ్‌ 
నవంబర్‌ 15 (ముంబై)

ఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికా 
నవంబర్‌ 16 (కోల్‌కతా)

Advertisement
Advertisement