తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం.. | Apple sets revenue records in India during March quarter | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న ఐఫోన్‌ విక్రయాలు.. భారత్‌లో ఎలా ఉందంటే..

Published Fri, May 3 2024 8:47 AM | Last Updated on Fri, May 3 2024 9:30 AM

Apple sets revenue records in India during March quarter

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్‌ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.

గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్‌ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్‌ ఉంది. భారత్‌లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.

యాపిల్‌ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్‌ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..

ముంబై స్టోర్ యాపిల్‌ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్‌ సాకెట్‌ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్‌ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement