Zim Afro T10 League: Donavan Ferreira Stars, As Hurricanes Beat Sam Army In Super Over - Sakshi
Sakshi News home page

Zim Afro T10 League: రసవత్తర సమరం.. సౌతాఫ్రికా బ్యాటర్‌ ఉగ్రరూపం.. పొట్టి క్రికెట్లో‌ అద్భుతం

Published Wed, Jul 26 2023 7:54 AM

Zim Afro T10 League: Donavan Ferreira Stars, As Hurricanes Beat Sam Army In Super Over - Sakshi

జింబాబ్వే టీ10 లీగ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి. బ్యాటింగ్‌లో హరారే హరికేన్స్‌ ఆటగాడు డొనవాన్‌ ఫెరియెరా (33 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) నిర్ణీత బంతుల్లో సగానికిపైగా ఎదుర్కొని బ్యాటింగ్‌ విశ్వరూపాన్ని ప్రదర్శించగా.. బౌలింగ్‌లో కేప్‌టౌన్‌ సాంప్‌ ఆర్మీ బౌలర్‌, విండీస్‌ ఆటగాడు షెల్డన్‌ కాట్రెల్‌ తన కోటా 2 ఓవర్లలో ఓ మెయిడిన్‌ వేసి, మరో ఓవర్‌లో కేవలం​ 2 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తంగా 3 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్‌లోనే మెయిడిన్‌ ఓవర్‌ వేయడం గగనమైపోయిన ఈ రోజుల్లో టీ10 ఫార్మాట్‌లో మెయిడిన్‌ వేసిన కాట్రెల్‌ రికార్డు సృష్టించాడు. 

బ్యాటింగ్‌ విషయానికొస్తే.. 60 బంతుల మ్యాచ్‌లో ఒకే బ్యాటర్‌ సగానికి పైగా బంతులు (33) ఎదుర్కోవడం ఆషామాషి విషయం కాదు. ఇది ఓ రికార్డు కూడా. గతంలో ఇంగ్లండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ ఎదుర్కొన్న 32 బంతులే టీ10 క్రికెట్‌లో ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యుత్తమం. తొలి ఓవర్‌ మెయిడిన్‌ అయ్యాక, ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో బరిలోకి దిగిన ఫెరియెరా ఆఖరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడి టీ10 ఫార్మాట్‌లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేశాడు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్‌లో క్రిస్‌ లిన్‌ (30 బంతుల్లో 91; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. 

టీ10 క్రికెట్‌లో  బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సంబంధించి అత్యుత్తమ గణాంకాలు ఒకే మ్యాచ్‌లో, ఒకే ఇన్నింగ్స్‌లో నమోదు కావడం విశేషం. హరారే ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ ఎదుర్కొన్న ఫెరియెరా.. కరీమ్‌ జనత్‌ బౌలింగ్‌లో ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. తొలి బంతి డాట్‌ కాగా.. ఆఖరి 5 బంతులను ఫెన్సింగ్‌ దాటించాడు ఫెరియెరా.

అంతకుముందు ఓవర్లోనూ హ్యాట్రిక్‌ బౌండరీలు బాదిన ఫెరియెరా.. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని, ఆతర్వాత 8 బంతుల్లో 35 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన అతని జట్టు హరారే హరికేన్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.హరికేన్స్‌ ఇన్నింగ్స్‌ ఫెరియెరా ఒక్కడే రాణించాడు. మరో ఆటగాడు జాంగ్వే (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్‌ చేశాడు. కేప్‌టౌన్‌ బౌలర్లలో కాట్రెల్‌ 3, నగరవా 2, హాట్‌జోగ్లూ ఓ వికెట్‌ పడగొట్టారు.

టైగా ముగిసిన మ్యాచ్‌.. 
116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేప్‌టౌన్‌.. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్భాజ్‌ (26 బంతుల్లో 56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్‌ టైగా ముగిసింది. 

అంత చేసి, ఆఖరి ఓవర్లో బొక్కబోర్లా పడిన కేప్‌టౌన్‌..
116 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లలో 108 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉండిన కేప్‌టౌన్‌, ఆఖరి ఓవర్‌లో విజయానికి కావల్సిన 8 పరుగులు చేయలేక డ్రాతో సరిపెట్టుకుంది. తొలి 4 బంతులకు 6 పరుగులు వచ్చినా, చివరి 2 బంతుల్లో 2 పరుగులు చేయలేకపోయింది. టీమిండియా మాజీ బౌలర్‌ శ్రీశాంత్‌ వేసిన ఈ ఓవర్‌లో ఐదో బంతికి విలియమ్స్‌ రనౌట్‌ కాగా.. ఆఖరి బంతికి లెగ్‌ బై రూపంలో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.

సూపర్‌ ఓవర్‌లో హరికేన్స్‌ విజయం..
స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయగా.. ఇక్కడ హరికేన్స్‌ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  కేప్‌టౌన్‌.. వికెట్‌ కోల్పోయి 7 పరుగులు చేయగా.. హరికేన్స్‌ 5 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement