టైటిల్: సత్యభామ
నటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, అంకిత్ కోయా, అనిరుథ్ పవిత్రన్, సంపద, సత్య ప్రదీప్త, హర్షవర్థన్, రవివర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే,ప్రెజెంటర్:శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
దర్శకత్వం: సుమన్ చిక్కాల
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : బి విష్ణు
విడుదల తేది: జూన్ 7, 2024
కథేంటంటే..
సత్య అలియాస్ సత్యభామ(కాజల్)షీ టీమ్ డిపార్ట్‌మెంట్‌లో ఏసీపీగా పని చేస్తుంది. అమ్మాయిలకు ఇబ్బంది కలిగించేవారిని మఫ్టీలో వెళ్లి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని శిక్ష పడేలా చేస్తుంది. అంతేకాదు షీ సేఫ్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పిస్తూ..తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా,సత్యభామ ఉందనే నమ్మకం మహిళల్లో కలిగించేలా చేస్తుంది. అలా ఓ సారి హసీనా అనే యువతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త యాదు(అనిరుథ్ పవిత్రన్)చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సత్యతో చెబుతుంది. యాదుకి సత్య వార్నింగ్ ఇవ్వగా..అదే కోపంతో అతను హసీనాను చంపేసి పారిపోతాడు.
ఎలాగైన అతన్ని పట్టుకొని శిక్షించాలనేది సత్య కోరిక. యాదు కోసం వెతుకుతూనే ఉంటుంది.ఈ క్రమంలో ఓ రోజు హసీనా తమ్ముడు, వైద్యవిద్యార్థి ఇక్బల్(ప్రజ్వల్) మిస్ అవుతాడు. ఈ కేసును సత్య పర్సనల్‌గా తీసుకుంటుంది. పై అధికారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా విచారణ చేస్తుంది. ఈ మిస్సింగ్ కేసుకి లోకల్ ఎంపీ కొడుకు రిషి(అంకిత్ కోయా)కి లింక్ ఉందని తెలుస్తుంది.
అతన్ని పట్టుకునే క్రమంలో విజయ్, నేహాలు ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. అసలు ఇక్బల్‌ని కిడ్నాప్ చేసిందెవరు? సత్య, విజయ్‌లు ఎవరు? వీరిద్దరు రిషికి ఎలా పరిచయం అయ్యారు? సత్య ఈ కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంది? ఇన్వెస్టిగేషన్‌లో ఆమెకు తెలిసిన నిజాలు ఏంటి? ఇంతకీ యాదు దొరికాడా లేదా? దివ్య ఎవరు? ఆమెకి ఇక్బల్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఇక్బల్ మిస్సింగ్ కేసుని సత్య ఎలా ఛేదించింది? భర్త అమరేందర్(నవీన్ చంద్ర)తనకు ఎలా తోడుగా నిలిచాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపే జోనర్స్ లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఒకటి. కథలో ఇంట్రెస్ట్, సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ‘సత్యభామ’ కూడా అదే జోనర్‌లో తెరకెక్కిన మూవీ. అయితే ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కథనం సాగుతుంది. సాధారణంగా సస్సెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఓ హత్య జరగడం.. ఆ హత్య ఎవరు చేశారనేది తెలియకపోవడం..దాన్ని ఛేదించే క్రమంలో పోలిసులకు(హీరో/హీరోయిన్) కొన్ని నిజాలు తెలియడం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. కానీ సత్యభామలో హత్య ఎవరు చేశారనేది ముందే తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడమే హీరోయిన్ పని. ఈ సినిమా కథ పాతదే కానీ, హీరోయిన్ అలాంటి పాత్ర చేయడం..కథనం సస్పెన్స్‌తో పాటు ఎమోషనల్‌గా సాగడంతో కొత్తగా అనిపిస్తుంది.
‘కాళికా దేవి కోపం...సీతాదేవి శాంతం’అంటూ సినిమా ప్రారంభంలోనే హీరోతో ఓ డైలాగ్ చెప్పించి, సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఆమె పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ అనే చేప్పేలా ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ గురించి చూపించి.. హసీనా హత్యతో అసలు కథలోకి వెళ్లాడు. యాదుని వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా ఉండడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది.
అలాగే మధ్య మధ్యలో వచ్చే ఉపకథలు ఆకట్టుకున్నా.. మెయిన్ స్టోరీని పక్కదారి పట్టిస్తాయి. షీ సేఫ్ యాప్ ప్రాధాన్యత గురించే తెలియజేసే సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఊహించలేరు. ఆ పాత్ర చెప్పే ప్లాష్‌బ్యాక్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథలో అనేక పాత్రలు ఉండడం, అవసరం లేకున్నా కొన్ని ఉప కథలను జోడించడం కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్..తొలిసారి ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో నటించింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక అమ్మాయికి సాయం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తెరపై కనిచించింది. కాజల్‌లోని మరో యాంగిల్‌ని ఈ మూవీలో చూస్తారు.
ఇక సత్యభామ భర్త, రచయిత అమరేందర్‌గా నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఇక్బల్‌గా ప్రజ్వల్ యాద్మ బాగా చేశాడు. ప్రకాశ్‌రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు తెరపై కనిపించేది చాలా తక్కువ సమయే అయినా..ఉన్నంతగా బాగానే నటించారు. అయితే కాజల్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో.. సినిమాలోని ఇతర పాత్రలు ఏవీ మనకు గుర్తిండిపోలేవు. సాంకేతికపరంగా సినిమా చాలా బాగుంది. శశికిరణ్ తిక్క స్క్రీన్‌ప్లే సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం పెద్ద అసెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్: 2.75/5
Comments
Please login to add a commentAdd a comment