ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.కోటి సాయం | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.కోటి సాయం

Published Sat, Jan 27 2024 5:19 AM

TSRTC enhances accidental insurance for employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:
 సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సు ఫెయిల్‌ కావటంతో ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించారు. కండక్టర్‌ బస్సు ముందు నిలబడి ఆ వివరాలను రిపోర్టులో రాస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొంది.. దీంతో బస్సు దూసుకొచ్చి ముందు నిలబడిన కండక్టర్‌ను ఢీకొనటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే ఆయన కుటుంబానికి ప్రమాద సాయంగా రూ.40 లక్షలు అందాయి.

మెహిదీపట్నంకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ చిన్న కారణంతో గతంలో ఆర్టీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించింది. దానిపై ఆ డ్రైవర్‌ లేబర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఇది జరిగిన  కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో అతను దుర్మరణం చెందాడు. సర్వీసులో లేకపోవటంతో ఆర్టీసీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చిన్న పిల్లలను చదివించేందుకు ఆయన భార్య ఇళ్లల్లో పాచి పనులు చేయాల్సి వచ్చింది. ఆ దీనావస్థకు చలించి కొందరు జోక్యం చేసుకోవటంతో చివరకు ఆ ఉద్యోగి కుటుంబానికి కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సాయం అందింది. 

ఇలా అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. సంపాదించే కుటుంబ పెద్ద చనిపోతే అల్పాదాయ కుటుంబాలు ఆర్థికంగా ఎదు ర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆస్తులు లేని కుటుంబాలు, సంపాదించే ఇతర వ్యక్తులు లేని కుటుంబాలు రోడ్డున పడటమే. ఇలాంటి సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వారి ఖాతాలున్న బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రమాదవశాత్తూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబాలకు ఇకపై ఏకంగా రూ.కోటి సాయం అందనుంది. ఆ ఉద్యోగి పేరుతో రూపే కార్డు ఉంటే మరో రూ.15 లక్షలు అందుతుంది. వెరసి, రూ.1.15 కోట్లు అందటం ద్వారా ఆ కుటుంబానికి ఆర్ధికంగా వెసులుబాటు కలగబోతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది.

ఖాతాలు యూబీఐలోకి రావడంతో.. 
ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా ఊరటనిచ్చే ప్రమాద బీమా లేదు. సంస్థ పరంగా అందే సాయం కూడా నామమాత్రమే. ఇలాంటి తరుణంలో, సూపర్‌ సేవింగ్‌  శాలరీ ఖాతా ద్వారా యూబీఐ పెద్ద వెసులుబాటు కల్పించింది. గతంలో ఆర్టీసీ జీతాల ఖాతాలు మరో బ్యాంకులో ఉండేవి. ఏడాదిన్నర క్రితం ఎండీ సజ్జనార్‌ వాటిని యూబీఐలోకి మార్చారు. ఆ సమయంలో ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందే వెసులుబాటు గురించి చెప్పిన బ్యాంకు అధికారులు, ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాలను సూపర్‌ సేవింగ్‌ సాలరీ ఖాతాలుగా మార్చాలని సూచించారు. ఆ వెంటనే ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు పొందే వీలు కల్పించింది. దాదాపు ఏడాదిగా అది అమలవుతోంది. ఈ సమయంలో దాదాపు 20 మంది ఆర్టీసీ ఉద్యోగులుకు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. వీరి కుటుంబాలకు దశలవారీగా ప్రమాద బీమా కింద రూ.40 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని బ్యాంకు అందజేసింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ, ప్రతినెలా ఠంచన్‌గా జీతం అందే వారికి ఈ ఖాతా పొందే వీలును బ్యాంకు కల్పిస్తోంది. 

బ్యాంకుల మధ్య పోటీతో పెంపు
బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం నేపథ్యంలో, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.కోటికి పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 47 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ప్రతినెలా రూ.220 కోట్ల వరకు వారి జీతాల పద్దు ఉంటుంది. నిత్యం ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు టికెట్ల రూపంలో ఆదాయం (మహిళలకు అందించే జీరో టికెట్ల మొత్తం కాకుండా) ఉంటుంది. ఇవన్నీ ఆ బ్యాంకులోనే డిపాజిట్‌ అవుతాయి. ఇది పెద్ద మొత్తం కావటంతో సంస్థను ఆకట్టుకునేందుకు ఆ బ్యాంకు ఈ ప్రమాద బీమా మొత్తాన్ని పెంచింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది. ఇక బ్యాంకు అందించే రూపే కార్డు ఉన్న వారికి అదనంగా మరో రూ.15 లక్షలు కూడా అందుతుంది.

ఇప్పటికీ అవగాహన లేని ఉద్యోగులెందరో..
     ఈ ప్రమాద బీమా గురించి దాదాపు ఉద్యోగులందరికి తెలిసినా, అది వర్తించాలంటే ఏం చేయాలన్న విషయంలో కొందరికి ఇప్పటికీ అవగాహన లేదు. తమ ఖాతాలను సూపర్‌ సేవింగ్స్‌ సాలరీ ఖాతాగా మార్చాలంటూ ప్రతి ఉద్యోగి సంబంధిత బ్యాంకు బ్రాంచీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ, ఆ ఖాతాలోకి మారని ఉద్యోగులెందరో ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రమాదవశాత్తూ చనిపోతే వారికి ఈ పథకం వర్తించదు. దాదాపు ఏడాదిగా ఆ బ్యాంకు ప్రమాద బీమా వసతిని అమలు చేస్తున్నా, ఉద్యోగులకు అవగాహన కల్పించటంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఇక రూపే కార్డు తీసుకోవాలని, దాన్ని ప్రతి 45 రోజుల్లోపు ఒకసారన్నా కచ్చితంగా వాడాలన్న నిబంధన గురించి కూడా అవగాహన లేదు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఈడీ కృష్ణకాంత్‌ చర్యలు ప్రారంభించారు. ఈ పథకం వివరాలు, ఉద్యోగులు అనుసరించాల్సిన విషయాలను తెలియ చెప్తూ ఫ్లెక్సీలు రూపొందించి అన్ని డిపోలకు పంపుతున్నారు.

Advertisement
Advertisement