
రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటాం. నచ్చిన విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. భద్రంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువులు కాలిపోవడంతోపాటు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు పోవచ్చు. ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపు ప్రమాదం మరింత తీవ్రస్థాయికి చేరవచ్చు. అసలే వేసవికాలం ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత రక్షణగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటితోపాటు కంపనీలు, షాపింగ్‌మాల్స్, భవనాల్లో తప్పకుండా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉపయోగించాలంటున్నారు. వీటికోసం చేసే చిన్నపాటి ఖర్చుతో ఇంటికి మరింత భద్రత కల్పించవచ్చని చెబుతున్నారు. వాటిని ఎంచుకునేముందు కనీస అవగాహన తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు.
మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు చాలా రకాలుగా ఉంటాయి.
స్టాండర్డ్ వాటర్: కాగితం, కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్, కలప, ఫ్యాబ్రిక్‌కు అంటిన మంటలను అదుపు చేయవచ్చు.
డ్రైవాటర్ మిస్ట్: నీటి రేణువులను పొడి సూక్ష్మకణాలుగా మార్చి మంటపై చల్లుతుంది.
వెట్ కెమికల్: మంటలపై సబ్బు ద్రావణాన్ని చల్లుతుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే మంటలను అదుపు చేయవచ్చు.
పౌడర్: పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ నుంచి వచ్చే మంటలు, మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువుల వల్ల ఏర్పడే వాటినిక ఆర్పవచ్చు.
కార్బన్ డైయాక్సైడ్: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు తగ్గించవచ్చు.
వాటర్ మిస్ట్ టైప్ ఫైర్: వరండాలు, వంట గదిలో వాడుకోవచ్చు. ఇది మంటపై నీటిని స్ప్రే చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment