Sakshi News home page

నిప్పుల కొలిమి!

Published Sat, Apr 20 2024 4:42 AM

Maximum temperatures 5 degrees above normal: Telangana - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమంటున్న ఎండలు

సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు

తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి 

మరో మూడు రోజులపాటు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ 

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం 

అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటికి రావద్దని హెచ్చరికలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్‌ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. 

మరో మూడు రోజులు ఇలానే.. 
రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. 

తీవ్ర ఎండలతో జాగ్రత్త 
అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్‌ వేవ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అవేమంటే.. 
► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్‌ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. 
​​​​​​​► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి.  
​​​​​​​► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్‌ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. 
​​​​​​​► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. 
​​​​​​​► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి.

Advertisement
Advertisement