తమిళసినిమా: అభిమానులు దళపతిగా నెత్తిన మోస్తున్న నటుడు విజయ్. ఈయన్ని ప్రారంభ కాలంలో నటుడిగా నిలబెట్టింది ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్. నాళైయతీర్పు చిత్రంతో విజయ్‌ను కథానాయకుడిగా పరిచయం చేసింది ఆయనే. ఆ తరువాత వరుసగా చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. అదే విధంగా విజయ్‌ను రాయకీయ రంగ ప్రవేశానికి శ్రీకారం చుట్టిందీ ఆయన తండ్రే. మొన్న మొన్నటి వరకూ విజయ్ గురించి, ఆయన చిత్రాల కాల్‌షీట్స్ గురించి అంతా చూసుకుంది దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌నే. విజయ్ పేరుతో అభిమాన సంఘాన్ని ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ, విజయ్ తన తండ్రిని దూరంగా పెట్టారు. ఆయనతో మాట్లాడటమే పాపంగా భావిస్తున్నారు.
కాగా కొంత కాలం క్రితం పుదుచ్చేరి శాసన సభ్యుడు బుషీఆనంద్ నటుడు విజయ్ సరసన చేరి ఇప్పుడు అంతా ఆయనేగా మారారు. విజయ్ రాజకీయ రంగాన్ని ఆయనే రచిస్తున్నారు. ఈ వ్యవహారంపై మౌనం వహించిన విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ తాజాగా బరస్ట్ అయ్యారు. తన కొడుకు విజయ్‌తో అంటకాగుతున్న బుషీ ఆనంద్ గురించి తన ఎక్స్ మీడియాలో స్పందిస్తూ అంతా నాటకం అని పేర్కొన్నారు. ఆయన ఎలాంటి వారో చెబుతూ తాను బుషీ ఆనంద్‌పై కావాలని ఆరోపణలు చేయడం లేదని, నిజం ఏమిటన్నది మీరందరికీ తెలుసన్నారు.
ఆయన ఆన్‌లైన్ గ్రూప్ ద్వారా తనకు మద్దతు కూడకట్టుకుంటున్నారన్నారు. అందుకంటూ ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఆ గ్రూప్‌లో విజయ్ కూడా ఉన్నారని చెప్పారు. అంతా నాటకం అని, ఏ రాజకీయ నాయకుడూ చేయనిది బుషీ ఆనంద్ చేస్తున్నారని అన్నారు. అభిమాన సంఘానికి వచ్చే బుషీ ఆనంద్ అలసిపోయి అక్కడ ఉన్న టేబుల్‌పై పడుకుంటారని, దాన్ని ఒక వ్యక్తి పొటో తీసి ఆన్‌లైన్ గ్రూప్‌లో పొందుపరుస్తాడని చెప్పారు. దాన్ని మరో 50 మంది షేర్ చేస్తారన్నారని, మరో 100 మందితో లైక్ చేయిస్తారని ఇదంతా నాటకం అని అన్నారు.
ఇదంతా చూసిన విజయ్, బుషీ ఆనంద్ తన కోసం రంగంలోకి దిగి ఇలా కింద కూడా కూర్చొంటున్నారని, ఆయన గురించి చాలా గొప్పగా భావించి అన్నా.. రేపటి నుంచి మీరు తనతో ఉండండి అని చెప్పారన్నారు. ఇదే జరిగిందని, ఇలాంటి వారు పక్కన ఉంటే విజయ్ భవిష్యత్ ఏమైపోతుందోనన్న భయం కలుగుతోందని దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment