Star Hotel Room Prices Increased Ahead Of IPL 2024 SRH Vs RCB Match, More Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 SRH Vs RCB: ఐపీఎల్‌ ఫీవర్‌... హోటల్‌ రెంట్లు డబుల్‌!

Published Thu, Apr 25 2024 4:52 PM

Star hotels Room Price Increase To IPL Afflict - Sakshi

హాట్‌ ఫేవరేట్స్‌గా మారిన ఎస్‌ఆర్‌హెచ్‌–ఆర్‌సీబీ జట్లు 

15న జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయి స్కోర్లు 

గురువారం ఉప్పల్‌లో మరోసారి తలపడనున్న జట్లు 

చూసేందుకు దేశవిదేశాల నుంచి తరలి వస్తున్న అభిమానులు 

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటమూ ఓ కారణమే 

హఠాత్తుగా పెరిగిపోయిన స్టార్‌ హోటళ్ల రూమ్‌ అద్దెలు  
 

సాక్షి, హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫీవర్‌తో హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్ల గదుల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని స్టార్‌ హోటళ్లు బుక్‌ అయిపోయాయి. దీనికితోడు రేట్లు కూడా సాధారణం కంటే రెట్టింపు అంతకంటే ఎక్కువయ్యాయి. హోటల్‌ గదులు బుక్‌ చేసుకోవడానికి ఉపకరించే ప్రముఖ వెబ్‌సైట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉప్పల్‌ స్టేడియంలో గురువారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)–రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య ఫేవరేట్‌ మ్యాచ్‌ జరుగనుండటంతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 
 
అత్యధిక స్కోర్లతో హాట్‌ ఫేవరేట్లుగా... 
ప్రసుత్తం ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌–ఆర్‌సీబీ జట్లు హాట్‌ ఫేవరెట్స్‌గా మారిపోయాయి. ఈ రెండింటి మధ్య ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కేంద్రంగా ఓ మ్యాచ్‌ జరిగింది. అందులో ఎస్‌ఆర్‌హెచ్‌ 287, ఆర్‌సీబీ 262 పరుగులు చేసి రికార్డు సృష్టించాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇవి అత్యధిక స్కోర్లు కావడంతో ఈ రెండు జట్ల పైనా ఐపీఎల్‌ ప్రియులకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలోనూ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు  హైదరాబాద్‌ చేరుకున్నాయి. వీరి కోసం రెండు స్టార్‌ హోటళ్లలో చాలా భాగం నిర్వాహకులు బుక్‌ చేశారు. దీంతో పాటు ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి అనేక మంది క్రికెట్‌ అభిమానులు వస్తున్నారు. వీళ్లు సైతం ఆన్‌లైన్‌లో, ప్రముఖ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా స్టార్‌ హోటళ్లలో గదులు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లోని అనేక స్టార్‌ హోటళ్లలో శుక్రవారం వరకు గదులు ఖాళీ లేవని ఆయా వెబ్‌సైట్లు చూపిస్తున్నాయి.  

సరాసరిని మించిన బుకింగ్‌... 
హోటళ్లల్లో గదులు బుక్‌ కావడం, అందులో అతిథులు బస చేయడాన్ని ఆక్యుపెన్సీగా పిలుస్తారు. స్టాటిస్టా సంస్థ అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లల్లో ఆక్యుపెన్సీ రేటు సరాసరి గరిష్టంగా 50 నుంచి 60 శాతం మాత్రమే ఉంటోంది. 2021–22 ఆరి్థక సంవత్సరంలో ఇది 51 శాతంగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో 73 శాతంగా నమోదైంది. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌తో పాటు పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో ప్రస్తుతం అనేక స్టార్‌ హోటళ్లు ‘నో రూమ్‌’గా మారిపోయాయి. ఉన్న వాటిలోనూ అద్దెలు సాధారణ సమయం కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ వెబ్‌సైట్లు, యాప్స్‌ సూచిస్తున్నాయి. గురువారం రాత్రి క్రికెట్‌ మ్యాచ్‌ ఉండటంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో కంటే వీకెండ్స్‌లో హోటల్‌ రూముల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూసినా శని–ఆదివారాల్లో ఆయా హోటళ్ల అద్దెల కంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఎక్కువగా ఉన్నాయి.  

సైబరాబాద్‌ పరిధిలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ లో ఉన్న షెరిటన్‌ హోటల్‌లో ప్రెసిడెన్షియల్‌ స్వీట్‌ అద్దె మంగళ–బుధవారాల్లో రూ.1.28 లక్షలుగా ఉండగా... శుక్రవారం నుంచి ఇది రూ.64 వేల నుంచి రూ.67 వేల వరకు మాత్రమే ఉన్నట్లు ఆయా వెబ్‌సైట్లు చూపిస్తున్నాయి. ఇదే హోటల్‌లో సాధారణ గది అద్దె మంగళ–బుధవారాల్లో రూ.21,500గా, శని–ఆదివారాల్లో రూ.11,250గా ఉంది.  

హైటెక్‌ సిటీలోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో మంగళ–బుధవారాలకు అద్దె రూ.32 వేలుగా చూపిస్తోంది. శని–ఆదివారాలకు ఈ మొత్తం రూ.9,800గా ఉంది. వెస్టిన్‌ హోటల్‌లో మంగళ–బుధవారాలకు రూ.22,500గా, శని–ఆదివారాలకు రూ.10 వేలుగా కనిపిస్తోంది. 

సోమాజీగూడలోని ది పార్క్‌ హోటల్‌లో గది అద్దె మంగళ–బుధవారాలకు రూ.11,587గా, శని–ఆదివారాలకు రూ.5,071గా ఉంది. గురు–శుక్రవారాల్లో ఆయా హోటళ్లలో నో రూమ్‌ అని కనిపిస్తోంది.  

(అద్దె మొదటి రోజు చెక్‌ ఇన్‌ సమయం నుంచి రెండో రోజు చెక్‌ ఔట్‌ సమయం వరకు... పన్నులు దీనికి అదనం)

Advertisement

తప్పక చదవండి

Advertisement