అంగన్‌వాడీల్లో విలవిల | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో విలవిల

Published Mon, May 6 2024 2:25 AM

అంగన్

అచ్చంపేట: రెండు నెలలుగా భానుడి భగభగ మండుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో 46 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దలే బయట తిరగలేకపోతున్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం నిత్యం అంగన్‌వాడీలకు వెళ్లే చిన్నారులకు మాత్రం సెలవులు ఇవ్వకపోవడంతో ఏడాదంతా సెంటర్లు నడుపుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు వారికి సేవలు అందించే టీచర్లు, ఆయాలు, ఆరోగ్యలక్ష్మి కింద భోజనం చేయడానికి వచ్చే గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్నం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన, పౌష్టికాహారం అందిస్తుండగా.. చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

ఇరుకు గదులు.. కరెంటు, ఫ్యాన్లు కరువు..

జిల్లాలో 1,131 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 908 ప్రధాన, 223 మినీ కేంద్రాలు ఉన్నాయి. 457 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 138 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. 169 కమ్యూనిటీ హాళ్లు, 367 పాఠశాల ప్రాంగణాలో కొనసాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్నా.. చాలా కేంద్రాల్లో కరెంటు సౌకర్యం లేదు. కరెంటు ఉన్న చోట ఫ్యాన్లు లేక ఎండ వేడిమికి చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. అద్దె భవనాలు, ఇరుకై న గదులు, వెలుతురు లేని చీకటి గదుల్లో చిన్నారులు సతమతమవుతున్నారు. కరెంటు, ఫ్యాన్లు లేని పరిస్థితుల్లో ఆరేళ్లలోపు చిన్నారులు అవస్థలు వర్ణణాతీతం. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఒకే గదిలో నిర్వహిస్తూ.. అక్కడే వంట చేస్తుండటంతో గదుల్లో వేడి మరింత పెరుగుతోంది.

తగ్గుతున్న హాజరు శాతం..

అంగన్‌వాడీ కేంద్రాలకు సెలువులు ఉండని కారణంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులు పౌష్హికాహారం అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రాలు తెరిచి ఉంచుతున్నారు. చాలా చోట్ల రోజురోజు పెరుగుతున్న ఎండలకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడం తగ్గుతోంది. ఇంటికే పౌష్టికాహారం అందించాలనే డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో టీచర్లు, ఆయాలకు సమస్యగా మారింది.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 05

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు 1,131

చిన్నారులు 30,302

గర్భిణులు, బాలింతలు 10,277

ఇంటికి అందిస్తే మేలు..

వేసవి కాలంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లుగా, అంగన్‌వాడీలకు సెలవులు ఇచ్చి, పౌష్టికాహారం ఇంటికి అందించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వేసవి ముగిసే వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇంటికి ఇవ్వడంతో ఇబ్బందులు తీరుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు నీరసించిపోతున్నారని, ఈ నెలాఖరు వరకు పౌష్టికాహారాన్ని ముందుగానే అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉక్కపోతతో అల్లాడుతున్న చిన్నారులు

కేంద్రాల్లో మౌలిక వసతులు కరువు

ఫ్యాన్లు, కరెంట్‌కు నోచుకోని వైనం

అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల నుంచి 15 రోజులు టీచర్‌, మరో 15 రోజులు ఆయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండి పౌష్టికాహారం అందిస్తారు. ఎండల నేపథ్యంలో సెలవులు, ఇంటికి పౌష్టికాహారం అందించే విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – రాజేశ్వరీ డీడబ్ల్యూఓ నాగర్‌కర్నూల్‌

అంగన్‌వాడీల్లో విలవిల
1/2

అంగన్‌వాడీల్లో విలవిల

అంగన్‌వాడీల్లో విలవిల
2/2

అంగన్‌వాడీల్లో విలవిల

Advertisement
Advertisement