‘సేంద్రియా’నికి నూతనోత్సాహం | Sakshi
Sakshi News home page

‘సేంద్రియా’నికి నూతనోత్సాహం

Published Wed, Mar 6 2024 4:52 AM

The World of Organic Agriculture 2024 Report Revealed - Sakshi

ప్రపంచవ్యాప్తంగా 2022లో 26.6% పెరిగిన సేంద్రియ పంటల విస్తీర్ణం

రూ. 12 లక్షల కోట్లకు పెరిగిన ఆర్గానిక్‌ మార్కెట్‌

భారత్‌లో 78% పెరిగిన సేంద్రియ సాగు 

45 లక్షల మంది సేంద్రియ రైతుల్లో 25 లక్షల మంది భారతీయులే

ది వరల్డ్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌–2024 నివేదిక వెల్లడి 

(సాక్షి సాగుబడి డెస్‌్క)  ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పంటల విస్తీర్ణం 2021తో పోలిస్తే 2022 నాటికి సగటున 26.6% (2.03 కోట్ల హెక్టార్లు) పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో 77.8%, గ్రీస్‌లో 73%, ఆ్రస్టేలియాలో 48% సేంద్రియ సాగు పెరిగిందని పేర్కొంది.

అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ 2000 సంవత్సరంలో 15.1 బిలియన్‌ యూరోలుండగా 2022 నాటికి దాదాపు 135 బిలియన్‌ యూరోల (రూ. 12.13 లక్షల కోట్ల)కు పెరిగిందని... రిటైల్‌ అమ్మకాల్లో అమెరికా 56.6 బిలియన్‌ యూరోలతో అగ్రగామి మార్కెట్‌గా కొనసాగగా జర్మనీ, చైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించింది.

ఈ మేరకు 188 దేశాల నుంచి సేకరించిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ గణాంకాలతో కూడిన తాజా వార్షిక నివేదిక ‘ది వరల్డ్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌–2024’ను స్విట్జర్లాండ్‌కు చెందిన సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎఫ్‌ఐబీఎల్, ఐఫోమ్‌–ఆర్గానిక్‌ ఇంటర్నేషనల్‌ విడుదల చేశాయి. గత 25 ఏళ్లుగా ఏటా ప్రపంచ సేంద్రియ వ్యవసాయ గణాంకాలను ఈ సంస్థలు ప్రచురిస్తున్నాయి. 

ఆస్ట్రేలియా ఫస్ట్, ఇండియా సెకండ్‌.. 
♦ ఈ నివేదిక ప్రకారం 2022 చివరికి ప్రపంచవ్యాప్తంగా 9.64 కోట్ల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. 2021తో పోలిస్తే ఇది 26.6 శాతం లేదా 2.03 కోట్ల హెక్టార్లు ఎక్కువ. 
♦  సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం 2022లో 2 కోట్ల హెక్టార్లకుపైగా పెరిగింది. 5.3 కోట్ల హెక్టార్ల సేంద్రియ సాగు విసీర్ణంతో ఆ్రస్టేలియా అత్యధిక విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న దేశంగా నిలిచింది. 2022లో 48.6% వృద్ధిని సాధించింది. 
♦  47 లక్షల హెక్టార్ల సేంద్రియ/ప్రకృతి సేద్య విస్తీర్ణంతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. 2022లో సేంద్రియ/ప్రకృతి సేద్య విస్తీర్ణం ఏకంగా 78% పెరిగింది. 
♦  ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సంఖ్య 1999లో 2 లక్షలు ఉండగా 2022 నాటికి 45 లక్షలకు పెరిగింది. 2021లోకన్నా ఇది 26 శాతం ఎక్కువ. భారత్‌ అత్యధిక సంఖ్యలో 25 లక్షల మంది రైతులు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దేశంగా నిలిచింది.  
♦  సేంద్రియ సాగు ప్రాంతం సగానికిపైగా ఓషియానియా (5.32 కోట్ల హెక్టార్లు) దేశాల్లోనే కేంద్రీకృతమైంది. 22 దేశాల్లోని వ్యవసాయ భూమిలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ సాగు జరుగుతోంది. అయినా మొత్తం సాగు భూమిలో ఇప్పటికి సేంద్రియ సాగు వైపు మళ్లింది 2% మాత్రమే. సేంద్రియ సేద్య ప్రోత్సాహక కార్యాచరణ ప్రణాళికలతో కూడిన ప్రత్యేక చట్టాలు 2023 నాటికి 75 దేశాల్లో అమల్లోకి వచ్చాయి.  

Advertisement
Advertisement