కమనీయం.. నారసింహుని కల్యాణం | Sakshi
Sakshi News home page

కమనీయం.. నారసింహుని కల్యాణం

Published Thu, Mar 9 2017 12:40 AM

కమనీయం.. నారసింహుని కల్యాణం

– కదిరిలో పోటెత్తిన భక్త జనం
– పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు


కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కనులపండువగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘనాథరెడ్డి పట్టువస్త్రాలు మోసుకొచ్చి శ్రీవారికి సమర్పించారు. ఈసారి స్వామివారి కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వేదిక భక్తులను ఆకట్టుకుంది.

యాగశాల నుంచి నవ వధువులుగా అలంకృతులైన శ్రీదేవి, భూదేవిలతో పాటు వరుడు లక్ష్మీనారసింహుడు పల్లకీలో రాత్రి 9 గంటలకు మంగళ వాయిద్యాల మధ్య కల్యాణ మండపం చేరుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ప్రాంగణమంతా ‘లక్ష్మీనరసింహస్వామి గోవిందా.. గోవిందా..’ అంటూ  గోవింద నామస్మరణతో మార్మోగింది. ముక్కోటి దేవతలు వీక్షించే ఈ కల్యాణోత్సవాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి జరిపిస్తున్నారని అర్చక బృందం తెలిపింది. వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీవారికి ప్రతిరూపంగా విచ్చేసే కంకణ భట్టాచార్యులు మంగళసూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అలంకరించారు. దీంతో లక్ష్మీనారసింహుల కల్యాణం పూర్తయింది.

భక్తులతో కిటకిట
అత్యంత వైభవంగా జరిగిన ఖాద్రీ లక్ష్మీనారసింహుని కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాధారణ పెళ్లిళ్ల లాగానే స్వామివారికి భక్తులు చదివింపులు చదివించారు. ఉభయదారులుగా నామా రామచంద్రయ్య శెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్‌ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ పచ్చిపులుసు నరేంద్రబాబు పేర్కొన్నారు.

ప్రముఖుల హాజరు
జిల్లా మంత్రులు ఇద్దరు భక్తులతో సమానంగా నేలపైనే కూర్చొని శ్రీవారి కల్యాణం వీక్షించారు. ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంవీఐ చిర్రారెడ్డి శేషాద్రి దంపతులు, ఇంకా వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.

ధ్వజారోహణం
శ్రీవారి బ్రహ్మోత్సవాలను నలుదిక్కులూ చాటడానికి బుధవారం ఉదయం ఆలయం ముందున్న ధ్వజస్తంభానికి గరుడదండాన్ని «ధ్వజారోహణం గావించారు. తీర్థవాది రోజు ఈ ధ్వజారోహణం గావించి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. దీన్నే కదిరి ప్రాంతంలో కంకణాలు కట్టడం అంటారు. ఈ కంకణాలు విప్పేవరకూ అంటే తీర్థవాది ముగిసే వరకూ నరసింహ స్వామి భక్తులెవ్వరూ మాంసాహారం ముట్టుకోరు. పెళ్ళిళ్లు చేయరు. కర్ణాటకలో కూడా స్వామివారి భక్తులు ఈ పద్ధతినే పాటిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement