Rakshana Review: పాయల్‌ రాజ్‌పుత్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ మూవీ ఎలా ఉంది? Payal Rajput's Rakshana Movie Review and Rating in Telugu. Sakshi
Sakshi News home page

Rakshana Review: పాయల్‌ రాజ్‌పుత్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ మూవీ ఎలా ఉంది?

Published Fri, Jun 7 2024 5:52 PM | Last Updated on Fri, Jun 7 2024 7:08 PM

Payal rajput Rakshana Movie Review And Rating

టైటిల్‌: రక్షణ
నటీనటులు: పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్
దర్శక-నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్
సంగీతం: మహతి సాగర్
సినిమాటోగ్రఫీ: అనిల్ బండారి
ఎడిటర్: గ్యారి బి హెచ్
విడుదల తేది: జూన్‌ 7, 2024

ఆర్‌ఎక్స్‌ 100, ‘మంగళవారం’సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘రక్షణ’. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. మంచి అంచనాలతో నేడు(జూన్‌ 7)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
కిరణ్‌(పాయల్‌ రాజ్‌పుత్‌) ఓ పవర్‌ఫుల్‌ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్‌ చేసిన కిరణ్‌.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్‌ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్‌(మానస్‌)ని కిరణ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్‌ పగపెంచుకుంటాడు. ఓ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి అందులో కిరణ్‌ ఫోటోలను పోస్ట్‌ చేసి..ఆమె మొబైల్‌ నంబర్‌ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి. 

ఇది అరుణ్‌ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్‌.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్‌ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్‌ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో కిరణ్‌ సస్పెండ్‌కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్‌ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్‌ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్‌ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్‌ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్‌ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది?  ఈ కథలో రోష‌న్‌ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
నగరంలో వరుస హత్యలు జరగడం.. ఆ హత్యల వెనుక ఓ కిల్లర్‌ ఉండడం.. అతన్ని పట్టుకునేందుకు హీరో/హీరోయిన్‌  రంగంలోని దిగడం..తన తెలివితేటలన్నీ ఉపయోగించి చివరకు ఆ సైకో కిల్లర్‌ని అంతమొందించడం.. సైకో థ్రిల్లర్‌, క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలన్నీ ఇంచుమించు ఒకే మూసలో సాగుతాయి. దీంటో హత్యలు జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్‌ గేమ్‌, హీరో/హీరోయిన్‌  ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిస‌డ‌ల‌ని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘రక్షణ’ విషయంలో ఇది కొంతవరకే సఫలం అయింది. 

సైకో కిల్లర్‌.. అతని నేపథ్యం ఉత్కంఠభరితంగా ఉన్నా.. కథానాయికా చేసే ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరంగా ఉండదు. ఉమెన్‌ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే సీన్‌తో పాయల్‌ పాత్రను పరిచయం చేశాడు. ఆ తర్వాత వెంటనే తన ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి.. స్నేహితురాలి హత్యను చూపించి..అసలు కథను ప్రారంభించారు. సైకో కిల్లర్‌ ఎవరనేది చివరి వరకు చూపించకుండా కథపై ఆసక్తిని పెంచాడు. 

ఆ తర్వాత వెంటనే అర్జున్‌ పాత్రని చూపించి.. ప్రేక్షకుల మైండ్‌ డైవర్ట్‌ చేశాడు. ఫస్టాఫ్‌ అంతా అర్జున్‌, కిరణ్‌ల చుట్టే తిరుగుతుంది. అర్జున్‌ పట్టుకునేందుకు కిరణ్‌ చేసే ప్రయత్నం మెప్పించదు. ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్‌ ఎవరనేది తెలిసిన తర్వాత..అసలు అతను ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సైకో కిల్లర్‌ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకోవడంతో పాటు పెరెంట్స్‌ని ఆలోచింపజేస్తుంది.  సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్షపై కూడా దర్శకుడు ఓ మంచి సందేశాన్ని అందించాడు.  క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
ఇన్నాళ్లు తెరపై గ్లామర్‌గా కనిపించిన పాయల్‌.. ఈ చిత్రంలో డిఫరెంట్‌ రోల్‌ ప్లే చేసింది. ఏసీపీ కిరణ్‌ పాత్రలో ఒదిగిపోయింది. హీరో స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది. తెరపై సరికొత్త పాయల్‌ని చూస్తారు. బిగ్‌బాస్‌ ఫేం మానస్‌ తొలిసారి నెగెటివ్‌ పాత్రలో నటించాడు. అమ్మాయిలను ఏడిపించే శాడిస్ట్‌ అరుణ్‌ పాత్రకి మానస్‌ పూర్తి న్యాయం చేశాడు. రామ్‌ పాత్రకి రోషన్‌ బాగా సెట్‌ అయ్యాడు. రాజీవ్‌ కనకాల, శివన్నారాయణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల  పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. మహతి సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల టెన్షన్‌ పెట్టాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత ఒక్కరే కావడంతో సినిమాకు ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలను ఇష్టపడేవారికి ‘రక్షణ’ నచ్చుతుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement