నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ.. మోదీని తమ నేతగా ఎన్నుకోనున్న ఎంపీలు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఏన్డీఏ పక్ష నేతలు సమావేశమై మోదీని తమ నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన 293 మంది ఎన్డీఏ లోక్‌సభ సభ్యులు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. మోదీని తమ నేతగా ఎన్నుకోనున్నారు.
ఈ భేటీ అనంతరం మోదీ తనకు మద్దతు తెలుపుతున్న ఎంపీల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయనున్నారు. మోదీతో పాటు కూటమి సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కూడా రాష్ట్రపతిని కలుస్తారని కూటమి వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఏలోని పార్టీల అధ్యక్షులు కూడా మోదీకి మద్దతుగా రాష్ట్రపతికి లేఖలు సమర్పించనున్నారు.
ప్రమాణ స్వీకారానికి దేశాధినేతలు
బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భుటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాధినేతలు ఆదివారం మోదీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామ్‌కలవాన్‌లకు భారత్ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. మాల్దీవులతో భారత్ సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు మొయిజ్జును మోదీ ఆహ్వానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment