ర్యాపర్ లుక్.. కుర్రాళ్లకు కిక్ | Sakshi
Sakshi News home page

ర్యాపర్ లుక్.. కుర్రాళ్లకు కిక్

Published Sun, Feb 21 2016 2:06 AM

ర్యాపర్ లుక్.. కుర్రాళ్లకు కిక్

ఆడవాళ్ల కోసం ప్రత్యేకించిన యాక్ససరీస్ స్టోర్లు సందుకొకటి అన్నట్టున్నాయి సిటీలో. మగవాళ్ల యాక్ససరీస్‌లకు సంబంధించిన స్టోర్లు కూడా అదేస్థాయిలో విస్తరిస్తున్నాయి. ఈ ట్రెండ్‌కి ఆజ్యం పోస్తోంది.. ఇటీవల సిటీ కుర్రాళ్లు ఆసక్తి చూపిస్తున్న ర్యాపర్ లుక్.   
                                                                                                                - శిరీష చల్లపల్లి
 
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ర్యాప్ మ్యూజిక్ క్రేజ్ లాగే లుక్ విషయంలోనూ ర్యాప్‌స్టార్లది ప్రత్యేక స్టైల్. ‘బ్రేక్ ది రూల్స్’ అన్నట్టు సాగే ర్యాప్ మ్యూజిక్ షోల కోసం.. ఆర్టిస్టులు సైతం రూల్స్ బ్రేకర్స్‌లాగే తమని తాము డిజైన్ చేసుకుంటారు. వీరిని అనుసరించే యూత్ సిటీలోనూ ఉండడంతో ఈ ర్యాపర్ లుక్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
 
 ర్యాపర్.. సూపర్
 డ్రెస్సింగ్ ఎలా ఉన్నా ర్యాపర్ లుక్‌లో ప్రధాన పాత్ర పోషించేవి.. ఒంటి మీద ధరించే ఎక్స్‌ట్రా యాక్ససరీస్. అందుకే ఆ తరహా యాక్ససరీస్‌కు సిటీలో పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘ఖలేజా’ సినిమాలో మహేష్‌బాబు మెడలో వేసుకున్న మఫ్లర్, ‘రెబల్’ సినిమాలో ప్రభాస్ మెటల్‌చైన్, ట్రాన్స్‌పరెంట్ గాగుల్స్ వంటివన్నీ ఈ కోవలోనివే. ఇక స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ లుక్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోగా చెప్పుకోవాలి. ర్యాప్‌స్టార్ తరహా గెటప్‌లో ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలో ఈ క్రేజ్‌ను తారాస్థాయికి తీసుకెళ్లాడు బన్నీ. ‘రేసుగుర్రం’లో హైలైట్ లుక్‌తో అదరగొట్టాడు. దీంతో ఇప్పుడు యూత్ నెక్ చైన్లు, చిరిగిన షూస్‌తో సందడి చేస్తున్నారు. సినీ స్టార్స్ కోసం ఈ యాక్ససరీస్‌ను ముంబై, బెంగళూర్, బ్యాంకాక్, మలేషియా.. తదితర నగరాల్లో స్పెషల్‌గా షాపింగ్ చేసి మరీ కొనేవారు. కానీ ఇప్పుడు సిటీ యూత్‌కి పెరుగుతున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని మన నగరంలో సైతం స్టైలిష్ బాడీవేర్‌ల తయారీ ఊపందుకుంటోంది.
 
 తీర్చిదిద్దే వెరైటీలెన్నో..
 మల్టీపర్పస్‌గా ఉపయోగించే మఫ్‌వేర్‌ని క్యాప్‌గా తొడుక్కొని కళ్లకు తగినట్లుగా అద్దాలు ధరించి.. పెదవికి పియర్సింగ్ చేయించి.. మెడలో మఫ్లర్.. ఆ లోపల కనీకనిపించని ఉడెన్ అండ్ బ్లాక్‌మెటల్ డాగ్‌ట్యాగ్స్.. ఆ చైన్లకు తమ మనోభావాలు వ్యక్తపరిచేట్లుగా ఉండే రకరకాల ప్లేబాయ్ లాకెట్‌లు.. ఇలాంటి వాటితో ర్యాపర్ లుక్ ఒక రకమైన కిక్ ఇస్తోందంటున్నారు సిటీ కుర్రాళ్లు. వీటితో పాటు సీ-షెల్స్, క్రాస్ సింబల్, మ్యాగ్నటిక్ బ్రోకెన్‌హార్ట్ లాకెట్.. యానిమల్ పార్ట్స్ కుర్రాళ్లకు యమక్రేజీగా మారాయి. చేతులకు స్కల్‌రింగ్స్, నకెల్ రింగ్స్, త్రీ ఫింగర్ జాయింట్ రింగ్, పచ్చబొట్టులా హ్యాండ్ టాటూ బ్యాండ్ మణికట్టు నుంచి భుజం దాకా వేసుకోవడం ఇందులో భాగమే. ఇంకా మణికట్టుకు లెదర్ బ్యాండ్స్, మెటల్ చైన్ బ్యాండ్స్, హాలోవీన్ బ్యాండ్, డిజిటల్ బ్యాండ్ ఇలా ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. డ్రెస్‌లకు యాడ్ చేసుకోవడానికి కూడా రకరకాల ర్యాపర్ యాక్ససరీస్ దొరుకుతున్నాయి. షర్ట్‌కు బో టైలు, పాకెట్ చైన్, స్మార్ట్ పిన్స్, షైనింగ్ లెడ్ యాక్ససరీస్ ఇలా ఎన్నో. మెడలో వేసుకొనే స్కార్ఫ్‌ని సైతం రోల్ చేసి ప్యాంట్ లూప్స్‌లోంచి తీసి బెల్ట్‌గా చూపించడం కూడా ఇందులో భాగమే.
 
 ప్రశ్నించే ఫ్యాషన్..
 ఫ్యాషన్ అంటే ఇలా  ఉండాలని నిర్వచించే దశ దాటి.. ఇలా ఎందుకు ఉండకూడదు? అంటూ తమ శైలి ద్వారా ప్రశ్నించేదే ర్యాపర్ లుక్ అని వర్ణించొచ్చు. ట్రెండ్‌ని ఫాలో అయ్యే వారే కాదు.. ట్రెండ్‌ను సృష్టించే వారిగా ఈ ర్యాపర్స్‌ని పేర్కొంటారు. ఈ తరహా క్రేజీ స్టఫ్ కోసం యాక్ససరీస్ ప్రత్యేకంగా తయారు చేయించుకోవడం, విభిన్న నగరాల నుంచి తెప్పించడం జరుగుతోందని ‘ఎఫ్ స్టోర్’ ఓనర్ అజయ్ రామ్ చెప్పారు. ఈ యాక్ససరీస్ కనీసం రూ.10 నుంచి రూ.500 వరకు అందుబాటులో ఉన్నాయన్నారు.
 
 ఫుల్ జోష్..
 సినీ హీరోలకు, స్టేజ్ పెర్ఫార్మర్లకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన ర్యాపర్ లుక్ సిటీ యూత్‌కి బాగా ఫేవరెట్‌గా మారింది. డ్రెస్ డిజైనింగ్‌లోనూ ఈ లుక్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డిఫరెంట్ యాక్ససరీస్ వినియోగం గురించి మమ్మల్ని తరచూ సలహాలు అడుగుతున్నారు. చాలామంది ఫ్యాషన్ ప్రియులు ఫ్యాబ్రిక్‌తో కూడా రకరకాల యాక్ససరీస్ కస్టమైజ్డ్‌గా డిజైన్ చేయించుకుంటున్నారు.        - హర్ష, ఫ్యాషన్ డిజైనర్

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement